హాస్టల్‌ విద్యార్థులకు రక్షణ కల్పించండి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 (: నిజామాబాద్‌ నగర శివారులో ఉన్న ఎస్టీ హాస్టల్‌ విద్యార్థినులకు రక్షణ కరవైందని ఆరోపిస్తూ గురువారం పిడిఎస్‌యు విద్యార్థులు కలెక్టరేట్‌లో ధర్నాకు దిగారు. విద్యార్థి సంఘ నాయకులు జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు రమ్మని పోలీసులు సూచించినా వారు ససేమిరా అనడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరకు పోలీసులు పదిమంది విద్యార్థినులను అరెస్టు చేశారు. పిడిఎస్‌యు నాయకురాలు సరిత మాట్లాడుతూ నగర శివారులో ఉన్న ఎస్టీ హాస్టల్‌లో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయాయని, అనేకమార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యార్థినులకు పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జగదీశ్వరచారికి వినతిపత్రాన్ని అందజేశారు.