హాస్టళ్ల నిర్వహణా తీరు మారాలి
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లోని పేద విద్యార్థుల ఆకలిని తీర్చాలన్న సదాశయంతో సన్నబియ్యంతో వండి వడ్డించాలని చర్యలు తీసుకుంది. ఈ మేరకు సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఇప్పుడు సన్నబియ్యం సరఫరా అవుతున్నాయి. అయితే పరిశుభ్రత విషయంలో ఏజెన్సీల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల విూదకు తెస్తోంది. వంటను శుచిగా శుభ్రంగా వండి పెట్టడంలో ఏజెన్సీలు విఫలం అవుతున్నాయి. ఈ కారణంగా అడపాదడపా అనేక చోట్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. హాస్టళ్ల నిర్వహణ కూడా ఇలాగే ఉంటోంది. కెసిఆర్ తెలంగాణలో విద్యార్థులకు మంచి విద్య, మధ్యాహ్నభోజం, హాస్టళ్లలో సకల సౌకర్యాలకు ఆదేశించి అమలు చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డాడన్న చందంగా మన వ్యవస్థ తయారయ్యింది. నేటి విద్యార్థులు రేపటి దేశ భవిష్యత్ అన్న నిజాన్ని వంట నిర్వాహకులు గుర్తించడం లేదు. భోజనం సక్రమంగా వండి వార్చక పోవడం, అపరిశుభ్రతను తొలగించకపోవడం వంటి కారణాలు నిత్యం వార్తలుగా చూస్తున్నాం. నిర్వాహకుల నిర్లక్ష్యానికి పేద విద్యార్థుల బలవుతున్నారు. పరిశుభ్రత, వంటలో నాణ్యత లోపించడం వల్ల వారు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. తరచూ తనిఖీలు చేస్తున్నా వంట కాంట్రాక్టర్లు మాత్రం దీనిని పట్టించుకోవడం లేదు. అక్షయపాత్రకు హాస్టళ్ల నిర్వహణ అప్పగించాలన్న డిమాండ్ ఉన్నా ఎక్కడికక్కడ నిర్వాహకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో డొల్లతనం బయటపడుతోంది. ఈ పథకాన్ని అమలుచేస్తున్నా పలు సందర్భాల్లో భోజనం వికటించి బాలలు అస్వస్థతకు గురవుతున్నారు. సర్కారు బడుల్లోని మెజారిటీ పాఠశాలల్లో వంట గదులు లేక అపరిశుభ్ర పరిసరాల మధ్య వంట చేయడం, నాణ్యతలేని కూరలు, పర్యవేక్షణ లోపం, వంట ఏజెన్సీలు ప్రధానోపాధ్యాయుల మాటను పక్కనబెట్టడం వంటి కారణాలతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. వంటపాత్రల పరిశుభ్రతకు ఉపయోగించే నీరు కొరత, విద్యార్థులు ప్లేట్లను, చేతులను కడుక్కోవడంలో ఆశ్రద్ధ, తాగేందుకు, చేతులు కడుక్కునేందుకు ఒకే నీటిని ఉపయోగించడం, వంట, విద్యార్థులు తినే పరిసరాల్లో అపరిశుభ్రత లోపించడం వంటివి కారణాలవు తున్నాయి. ఇందుకు అవసరమైన సదుపాయాలు మెరుగుపర్చి, స్వచ్ఛ కార్యక్రమాలను విద్యార్థులతో చేయించాలి. కూరగాయలు, కూరల తయారీకి వాడుతున్న నూనెలు, పప్పులు, చింతపండు వంటి వాటిల్లో నాణ్యత లోపం.. తరచూ ఒకే రకం కూరగాయాలను పెట్టి మోనూ పాటించకపోవడం, ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యంలో నాణ్యత లోపం, ఉడకని అన్నం, కూరలు వడ్డించడం వంటివి చేస్తున్నారు. సరఫరా చేస్తున్న కోడిగుడ్లు సరిగ్గా ఉడక పెట్టకపోవడం, పొట్టు సరిగ్గా రాకపోవడం వంటివి జరుగుతున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. మరోవైపు అదనపు బాధ్యతలుగా దీన్ని పర్యవేక్షిస్తున్న ప్రధానో పాధ్యాయు లు, ఉపాధ్యాయులు, నిర్వాహకులకు మధ్య సమన్వయం లోపించడం కూడా కారణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేక, అపరిశుభ్రత తోడు కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నాయి. ఇటీవలి వరుస ఘటనలు పరిశీలిస్తే విషయం తెలుస్తుంది. సన్నబియ్యాన్ని ప్రభుత్వంమే సరఫరా చేస్తుండగా మెనూతో పాటు వారానికి మూడు కోడిగుడ్లను పెట్టేలా చర్యలు చేపట్టింది. అయితే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్కారు బడుల్లో దానికి అనుగుణమైన చర్యలను చేపట్టడం లేదు. ప్రధానంగా పాఠశాలల్లో వంట గదులు లేకపోగా, పలు పాఠశాలల్లో నిర్మించిన వంట గదులు ఇరుకుగా ఉండటంతో అవి ఉపయోగంలోకి రావడం లేదు. మెజారిటీ పాఠశాలల్లో ఆరుబయట మట్టి, చెత్తాచెదారం వంటి అపరిశుభ్ర వాతావరణం మధ్య వంట ఏజెన్సీలు మధ్యాహ్న భోజనాన్ని వండిస్తున్నారు. విద్యా శాఖ,
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ మధ్య సమన్వయం లోపించడం, నిర్మాణ వ్యయంలో హెచ్చుతగ్గులు ఉండటంతో వంటగదుల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. దీంతో ఆరుబయట అపరిశుభ్ర వాతవారణం లో వంట జరుగుతోంది. వంటగదులు లేక ఆరుబయట అపరిశుభ్ర పరిసరాల్లో వంట చేయడం, అలాంటి పరిసరాల్లోనే విద్యార్థులు భోజనం చేస్తున్నారు. తమిళనాడు తరహాలో ఏజెన్సీలను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. నెలనెలా వంట ఏజెన్సీల నిర్వాహకులకు సకాలంలో వేతనాలను చెల్లించాలి. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని ఏజెన్సీల నిర్వహకులు పేర్కొంటున్నారు. వంట చేసే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఆ ప్రాంతంలో పందులు, కుక్కలు విహరించడం, వంట మనుషులు అతిసారం వంటి అస్వస్థతతో ఉండటం, విద్యార్థులు తినే ముందు, మరుగుదొడ్లకువెళ్లిన అనంతరం చేతులు శుభ్రం చేసుకోకపోవడం, కలుషితమైన తాగునీరు, కూరగాయాలను సరైన రీతిలో కడగక పోవడం వంటి కారణాలతో ఆహారం తిన్న అనంతరం వాంతులు, విరేచనాలయ్యేందుకు కారణాలవుతాయని వైద్యులు అంటున్నారు. ఈ పరిస్థితి పోవాలంటే హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం వంటల్లో మార్పులు రావాలి. శుచిగా నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయపాత్ర లాంటి సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. అలా చయడం వల్ల నాణ్యమైన భోజనమే కాకుండా శుభ్రమైన భోజనం కూడా అందుతుంది. పిల్లలు కడుపునిండా భోంచేసి చదువుకునే వాతావరణం ఏర్పడుతుంది.