హిల్లరీ క్లింటన్ ముందంజ
– ఎగ్జిట్‌పోల్ సర్వే
న్యూయార్క్,ఏప్రిల్ 10(జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. డెమొక్రాటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పుంజుకుంటున్నట్లు వెల్లడవుతోంది. న్యూయార్క్‌లో ఫాక్స్ న్యూస్ నిర్వహించిన పోల్స్ ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఇక్కడ వీరిద్దరూ తమ ప్రత్యర్థుల కన్నా భారీ ఆధిక్యాన్ని కనబరిచారు. న్యూయార్క్‌లో ఈ నెల 19న ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి.రిపబ్లికన్లలో ట్రంప్ పట్ల సానుకూలత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. పురుషులు, మహిళలు, వివిధ ఆదాయ వర్గాలు, ఉన్నత విద్యావంతులు, స్వల్ప విద్యావంతులు …. ఇలాంటి తేడాలేవీ లేకుండా అన్ని వర్గాల ప్రజలు ట్రంప్‌కు గట్టి మద్దతిస్తున్నట్లు తేలింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ మద్దతుదార్లలో 54 శాతం మంది డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతిస్తున్నారు. 22 శాతంతో జాన్ కసిచ్‌కు రెండో స్థానం, 15 శాతంతో టెడ్ క్రుజ్‌కు మూడో స్థానం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. విస్కన్సిన్ రాష్టంలో కన్జర్వేటివ్‌లు 65 శాతం మంది క్రుజ్‌కు మద్దతివ్వడంతో ఆయన గెలిచారు. అయితే న్యూయార్క్‌లోని కన్జర్వేటివ్‌లలో కేవలం 19 శాతం మంది మాత్రమే ఆయనకు మద్దతిస్తారని వెల్లడైంది.డొనాల్డ్ ట్రంప్‌కు పురుషుల్లో 59 శాతం మంది, మహిళల్లో 49 శాతం మంది మద్దతిస్తున్నట్లు తెలిసింది. కళాశాల డిగ్రీలున్నవారి కన్నా 13 శాతం ఎక్కువగా అటువంటి విద్యార్హతలు లేనివారు ట్రంప్‌ను సమర్థిస్తున్నట్లు వెల్లడైంది.డెమొక్రాట్లలో హిల్లరీ క్లింటన్‌కు మద్దతిచ్చేవారు ఎక్కువగా ఉన్నారని తాజా సర్వే తెలిపింది. ఆమె ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌కు యువత, పురుషుల నుంచి అధిక మద్దతు లభిస్తోంది. హిల్లరీకి 53 శాతం, బెర్నీ శాండర్స్‌కు 37 శాతం మద్దతు లభిస్తోంది. విస్కన్సిన్ రాష్ట్రంలో గెలుపుతో డెమొక్రాటిక్ నామినేషన్ పట్ల శాండర్స్‌లో ఆశలు పెరిగాయి. విస్కన్సిన్‌లో శ్వేత జాతీయులు ఉన్నారు. ఓపెన్ ప్రైమరీలో స్వతంత్రులు భాగస్వాములయ్యే అవకాశం ఉంది. కానీ న్యూయార్క్ పరిస్థితి వేరు. ఇక్కడ క్లోజ్డ్ ప్రైమరీ జరుగుతుంది. ఇది హిల్లరీ క్లింటన్‌కు సానుకూలంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. మహిళల్లో 61 శాతం మంది, శ్వేత జాతీయులు కానివారిలో 56 శాతం మంది, పురుషుల్లో 43 శాతం క్లింటన్‌కు మద్దతిస్తున్నట్లు వెల్లడైంది. అయితే శాండర్స్‌కు మహిళల్లో 30 శాతం మంది, శ్వేత జాతీయులు కానివారిలో 37 శాతం మంది, పురుషుల్లో 47 శాతం మంది మద్దతిస్తున్నట్లు తేలింది.