హుజూరాబాద్‌లో వేడెక్కిన రాజకీయం
సవాళ్లు విసరి వేదిక వద్దకు వచ్చిన కౌశిక్ రెడ్డి
పోటాపోటీగా ఫ్లెక్సీల ఏర్పాట్లు చేసిన టిఆర్‌ఎస్, బిజెపి
కౌశిక్ రెడ్డికి అంత సీన్ లేదంటూ బిజెపి నేతలు ఎదురుదాడి
ఉద్రిక్త పరిస్థితులు మధ్య ఇరు పార్టీల్లో పలువురు నేతల అరెస్ట్
కరీంనగగర్,ఆగస్ట్5(జనంసాక్షి): హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించి.. వేదిక వద్దకు వెళుతున్న బీజేపీ నేతలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని అరెస్టు చేసి వీణవంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. కౌశిక్ రెడ్డి, టీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కౌశిక్ దిష్టిబొమ్మను బిజెపి నేతలు దగ్ధం చేశారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇదిలా ఉంటే.. కౌశిక్ రెడ్డి సవాళ్లపై బీజేపీ నేతలు స్పందించారు. మానుకొండలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు వేసిన కౌశిక్ రెడ్డితో చర్చకు ఈటల
రారని…. హుజురాబాద్ అభివృద్ధిపై మాట్లాడేందుకు తామే వస్తామని నియోజకవర్గ బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అన్నట్లుగానే సభా వేదిక వద్దకు భారీ ర్యాలీతో కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. ఆయన ప్రసంగం ముగిసే సమయానికి కొంతమంది బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. చౌక్ దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించారు. అప్పటికే భారీ సంఖ్యలో వచ్చిన టీఆర్‌ఎస్ నేతలు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తతంగా మారింది. వీరిని మరోసారి పోలీసులు చెదరగొట్టారు. మొత్తంగా బహిరంగసభ చర్చతో హుజురాబాద్ హీటెక్కింది. దీంతో హుజురాబాద్‌లో బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసారు. జమ్మికుంట, హుజురాబాద్‌లో అరెస్టులు కొనసాగుతున్నాయి. జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హుజురాబాద్ అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు సవాల్ చేసిన విషయం తెలిసిందే. వేదిక విూద టీఆర్‌ఎస్ నేతలు రెండు కుర్చీలు వేశారు. చౌక్ దగ్గరకు భారీగా టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను కౌశిక్ రెడ్డి తరలించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను మాత్రం పోలీసులు అరెస్టు చేసారు. హుజూరాబాద్ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది.ఈటెలకు దమ్మూ, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. ఆయన హుజురాబాద్‌లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. చర్చకు రమ్మంటే అల్లర్లు అని మాట్లాడుతున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు ప్రెస్‌విూట్లు పెట్టి తమ వాదన వినిపించారు. ఈ అంశంపై జెండాలు, ప్లెక్సీలు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా ఏర్పాటు చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది. చర్చకు ఒకరోజు ముందే టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు బలాబలాలు ప్రదర్శించుకుంటూ కర్రలతో ఘర్షణకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హుజూరాబాద్‌లో అభివృద్ధిపై చర్చకు రండి అంటూ ఈటలకు సవాల్ విసురుతున్న ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని ప్రతిగా బీజేపీ నాయకులు కూడా కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈటల పుణ్యంతోనే ఎమ్మెల్సీ పదవి అనుభవిస్తున్న కౌశిక్‌రెడ్డికి ఈటలతో బహిరంగ చర్చకు అర్హత లేదని, ఆయన రాజకీయ అనుభవమంత వయస్సు కూడా కౌశిక్ రెడ్డికి లేదని పేర్కొంటూ విూతో చర్చించేందుకు మేము సిద్ధం, మేం సరిపోతాం అంటూ కార్యకర్తలు పలు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.