హుజూర్ నగర్ లో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం- పాల్గొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): హుజూర్‌నగర్ మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి నల్గొండ ఎంపి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ
డిసెంబర్ 2018లో కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చినా లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలోని రైతులకు ఎలాంటి పంటల బీమా అందలేదన్నారు. అధిక వర్షాలు, వడగళ్ల వాన, వరదలు, తెగుళ్ల దాడి సమయాల్లో పూర్తిగా పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారన్నారు. వి ఎల్ ఆర్ పథకం కింద, తెలంగాణలోని 70 లక్షల ఎస్ హెచ్ జి సభ్యులకు కేసీఆర్ ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలకు పైగా బకాయి ఉందన్నారు. ఎన్‌ఎస్‌పి ఎడమ కాలువపై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల నిర్వహణను ప్రభుత్వం చేపడుతుందన్న హామీని కేసీఆర్ తప్పక నెరవేర్చాలన్నారు. గోపాలపురం సర్పంచ్ శాసనాల నాగ సైదయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో జరుగుతున్న అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరును వారికి సహకరిస్తున్న పాలకుల పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కావడం వల్లనే తమ గ్రామం గోపాలపురం అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీడీవో శాంత కుమారి , తాసిల్దార్ వజ్రాల జయశ్రీ, మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు హాజరయ్యారు.