హైకోర్టులో శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్
బ్రహ్మనందరెడ్డి బెయిల్‌పై 14న నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 6 (జనంసాక్షి): ఒయంసి కేసులో అరెస్టు అయిన ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సోమవారం నాడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు 12కు వాయిదా వేసింది. ఇప్పటికే ఆమె నాంపల్లిలో సిబిఐ కోర్టు, హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినా చుక్కెదురైంది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టులోనే తమ వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆమె ఈ ఏడాది జనవరి 6వ తేదిన కోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. అప్పటినుంచి ఆమె రిమాండ్‌లోనే ఉన్నారు. చంచలగూడ మహిళా జైలులో ఉన్నారు.
జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి అరెస్టు అయిన ఐఆర్‌ఎఎస్ అధికారి బ్రహ్మనందరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం నాడు సిబిఐ కోర్టులో వాదనలు ముగిశాయి. తదుపరి నిర్ణయాన్ని న్యాయమూర్తి ఈ నెల 14తేదికి వాయిదా వేశారు.