హైదరాబాద్‌లో.. కుండపోత వర్షం
– వేకువజామున రెండుగంటలపాటు ఎడతెరిపిలేని వర్షం
– చెరువులను తలపించిన రహదారులు
– తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు
– బోరబండలో నాలాలో పడి వ్యక్తి మృతి
– భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు
హైదరాబాద్, అక్టోబర్17(జనంసాక్షి) : భాగ్యనగరాన్ని భారీవర్షం ముంచెత్తింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన కుండపోత వర్షానికి నగర ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రెండుగంటల పాటు ఏకదాటిగా వర్షం కురియడంతో.. పంజాగుట్ట, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, అవిూర్‌పేటల్లో రోడ్లపై నీరు ఏరులై పారింది. అలాగే మాదాపూర్, మియాపూర్, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, అబిడ్స్ ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నీరు భారీగా నిలిచిపోవడంతో ఉదయం 6గంటల నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు మొదలయ్యాయి. రోడ్లపై నీరుభారీగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు పడ్డారు. ఇదిలాఉంటే భారీవర్షానికి బోరబండ సాయిబాబా ఆలయంవద్ద నాలాలో కొట్టుకుపోయి ఒకరు మృతిచెందారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది. కాగా నగరంలోని కొన్నిప్రాంతాల్లో ఇప్పటికీ వర్షంకురుస్తోంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, మూసాపేట, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, నిజాంపేటల వైపువెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఐటెక్ సిటీ, సైబర్ టవర్స్, లెమన్ ట్రీ, గూగుల్ కార్యాలయం వైపు వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంలు ఎదుర్కొన్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు బుధవారం రహదారులపై నిలిచిన వర్షపునీటితో ఇక్కట్లు పడ్డారు.
వర్షపునీటిలో మునిగిపోయిన వాహనాలు..
మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిజాస్టర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి. పాత భవనాలను ఖాళీ చేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని కమిషనర్ సూచించారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో మొబైల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కమిషనర్ దాన కిషోర్… అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు నీట ముగినిపోయాయి. యూసఫ్ గూడ కృష్ణానగర్ ప్రాంతంలో దుర్గామాత విగ్రహం భారీగా వర్షపునీరు పోటెత్తడంతో నీటిలో కొట్టుకుపోయింది. కాగా
శేరిలింగంపల్లిలో 12.3 సెం.విూ, ఖైరతాబాద్‌లో 8.6 సెం.విూల వర్షపాతం నమోదైంది.