హైదరాబాద్‌లో దారుణం..
– ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి
హైదరాబాద్, అక్టోబర్19(జనంసాక్షి) : ఇద్దరు పిల్లలను విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన స్రవంతికి(28) 10ఏళ్ల క్రితంవివాహం జరిగింది. వీరికి సాయితేజ(9), సాత్విక(7) ఇద్దరు సంతానం. కుటుంబ కలహాల కారణంగా ఏడేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో తల్లిదండ్రుల దగ్గర జీవనం కొనసాగిస్తోంది. భర్తకు వద్దకు తిరిగి వెళ్లిపోవాలని తల్లిదండ్రులు, పెద్దలు ఒత్తిడి చేశారు. తన భర్తకు మెంటల్ ఉందని వెళ్లడానికి నిరాకరించింది. ఏమైందో ఏమో గానీ స్రవంతి.. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ విషం తాగింది. ఇద్దరు పిల్లలు చనిపోయాక… స్రవంతి చనిపోవకపోవడంతో పక్కనే ఉన్న కరెంట్ హీటర్ పట్టుకుని ప్రాణాలు వదిలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.