హైదరాబాద్‌లో మూసీకి వరద

చాదర్‌ఘాట్‌ బ్రిడ్జిపై రాకపోకల నిషేధం
మూసీ పరివాహకంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ

హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): భాగ్యనగరంలో భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్‌ వంతెన పైనుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో చాదర్‌ఘాట్‌ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు నీట మునిగాయి. అధికారులు వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. దీంతో మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదతో మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రజలు భయాందోళనలు చెందుతుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు పత్తాలేరని,బాధితులకు కనీసం పునరావాస కేంద్రాలు కూడా కల్పించలేదని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. భారీ వరద ప్రవాహంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్‌ , హిమాయత్‌సాగర్‌ , హుస్సేన్‌సాగర్‌ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది. మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. మూసారంబాగ్‌, చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌ వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. ఉస్మాన్‌సాగర్‌ నుంచి 8,281 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్‌ నుంచి 10,700 క్యూసెక్కులు, హుస్సేన్‌ సాగర్‌ నుంచి 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వెళుతోంది.

తాజావార్తలు