హైదరాబాద్‌హై అలర్ట్‌

హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి):
ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోవచ్చని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. హైదరా బాద్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశముందని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆదేశించింది. ముష్కర మూకలు బుధ, గురువారాల్లో మరోసారి పేలుళ్లు జరిపే ప్రమాదముందని హెచ్చ రించింది. 48 గంటల పాటు నిఘాను ముమ్మరం చేయా లని సూచించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో ఐబీ హెచ్చరికలనుపట్టించుకోక పోవడం వల్లే దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు చోటు చేసుకున్నాయని తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. నగరంపై డేగకన్ను వేశారు. నగరమంతా జల్లెడ పడుతున్నారు. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోజంతా విస్తృత తనిఖీలు నిర్వహించారు. వాహనాలు సోదాలు చేశారు. ¬టళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు, వ్యాపార వాణిజ్య సంస్థలు, ఇంటర్నెట్‌ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాన రహదారులు, పార్కులు, షాపింగ్‌ మాల్స్‌లో విస్తృత సోదాలు నిర్వహించారు. లుంబినీ పార్కులో తనిఖీలు చేపట్టారు. ఐమాక్స్‌ వద్ద ఆక్టోపస్‌ సోదాలు నిర్వహించింది. శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్‌, వనస్తలిపురం, శంషాబాద్‌, కూకట్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మరోవైపు, రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ సోదాలు చేపట్టారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో పాటు ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్టాప్‌లలో పోలీసులను మోహరించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించి, ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతను పటిష్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను ముమ్మర సోదాలు నిర్వహించాయి. భాగ్యనగరంలో మరిన్ని పేలుళ్లు జరగవచ్చనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో వచ్చి, పోయే వారిని క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. బ్యాగులు, వాహనాలను అణువణువునా పరిశీలిస్తున్నారు.