.హైదరాబాద్‌ తూర్పులో ఐటీ విస్తరణకు చర్యలు : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,నవంబరు 4 (జనంసాక్షి):హైదరాబాద్‌ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నైట్‌ ఫ్రాంక్‌ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. నైట్‌ ఫ్రాంక్‌ హైదరాబాద్‌ స్పెషల్‌ రిపోర్టును కూడా మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌తో పాటు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా లీడర్‌షిప్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రియల్‌ ఎస్టేట్‌ సర్వేలో నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ప్రసిద్ధిగాంచింది అని కేటీఆర్‌ తెలిపారు. అమెజాన్‌, గూగుల్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో ఆఫీసులు ప్రారంభించాయి. ఇండ్లు, స్థలాల ధరలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త రాష్‌ర్టమైన అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. విద్య, వైద్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలుపాటిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హెల్త్‌ కేర్‌, వైద్య, విద్యా రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో ఇతర రాష్ట్రాల కంటే చాలా మెరుగ్గా ఉన్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొంది అని తెలిపారు. వరల్డ్‌ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా, బల్క్‌ డ్రగ్‌ ప్రొడక్షన్‌లో అగ్రగామిగా ఉన్నామని కేటీఆర్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ల తయారీలో హైదరాబాద్‌ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కానుందన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ హైదరాబాద్‌ నుంచే వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీని కేబినెట్‌ ఆమోదించిందని తెలిపారు. హైదరాబాద్‌ మహానగరాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ శాటిలైట్‌ టౌన్‌షిప్స్‌ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక నూతన పాలసీలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌లో వర్షాలు, వరదలను తట్టుకునేలా నాలాలను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆరేళ్లలో రాష్‌ర్టం అద్భుత ప్రగతి సాధించిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.దేశంలో హైదరాబాద్‌ నగరం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని నైట్‌ ఫ్రాంక్‌ సీఎండీ శశిర్‌ బైజల్‌ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ నూతన పాలసీలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో హైటెక్‌ సిటీ ఏరోస్పేస్‌తో పాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందడంతో ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపకుందుకుంది అని తెలిపారు. హైదరాబాద్‌లోనూ కన్జ్యూమర్‌ డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మరింత ముందుకెళ్తుందని చెప్పారు. ఇండివిడ్యువల్‌ హౌస్‌తో పాటు ఆఫీస్‌ స్పేస్‌కు కూడా హైదరాబాద్‌లో డిమాండ్‌ ఉందని శశిర్‌ బైజల్‌ తెలిపారు.