హైదరాబాద్‌ వదిలి ఢల్లీిలో ఏం చేస్తున్నారు

ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా
మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు
మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ది ఏమయ్యింది
కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ రెడ్డి
మూసారాంబాగ్‌ పరిసరాలను పరిశీలించిన మంత్రి

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): వరదలతో ప్రజలను నానాయాతన పడుతుంటే ఢల్లీిలో మకాం వేసిన సిఎం కెసిఆర్‌ ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్‌ మూసీ పరివాహకంలో కొందరు మట్టిపోసి ఆక్రమించి షాపులు, ఇతరనిర్మాణాలు చేపట్టినా పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి ఢల్లీిలో కూర్చోవటం విచారకరమన్నారు. సీఎం కేసీఆర్‌ నాలుగు రోజులు ఢల్లీిలో ఏమి చేశారో ప్రజలకు తెలియాలని అన్నారు. శనివారం ఉదయం ముసారంబాగ్‌ వద్ద మూసీ వరదను కేంద్రమంత్రి
పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పుత్రవాత్సల్యంతో కేసీఆర్‌ కేంద్రంపై విమర్శలు చేయటం తగదన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలాయని… ప్రజలు ఇంకోసారి టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వరని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులపై మంత్రి కేటీఆర్‌ అవాస్తవాలు చెప్తున్నారని మండిపడ్డారు. మూసీనది ఆక్రమణలను ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహి స్తున్నారని ఆరోపించారు. మూసీ ఒడ్డున అక్రమంగా షెడ్డులు వేసి పేదలకు అద్దెకు ఇస్తున్నవారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళలన చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. వరదలతో నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. మూసీకి వరద రావడంతో నీట మునిగిన ముసారాంబాగ్‌ బ్రిడ్జిని ఆయన పరిశీలించాక ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. ఈసారి కూడా భారీ వర్షాల కారణంగా లక్ష ఇళ్లు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏడాది తర్వాత కూడా మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి మార్పులు రాలేదని మండిపడ్డారు. మూసీ డెవలప్‌ మెంట్‌ కోసం ప్రభుత్వం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినా.. ఒక్క అడుగు కూడా ముందు పడలేదని చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టు రెడీ అయిందని లోన్లు వస్తున్నాయని చెప్పడం మినహా కేసీఆర్‌ సర్కారు చేసిందేవిూలేదని అన్నారు. రాత్రి సమయంలో మట్టి పోసి మూసీ పరివాహక ప్రాంతాలను ఆక్రమిస్తున్నారని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ఆ కారణంగానే పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మూసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని చెప్పినా కేసీఆర్‌ సర్కారు పట్టించుకోవడం లేదని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్‌ లోని సబర్మతి నదిని పరిశీలించి వచ్చిన మంత్రులు మూసీపై రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వరదల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.
ఇకపోతే భారీ వర్షాలతో నగరం ఆగమాగమైనా ముఖ్యమంత్రి మాత్రం బయట అడుగుపెట్టకపోవడం విచారకరమని కిషన్‌ రెడ్డి అన్నారు. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంటే ముఖ్యమంత్రి
ఢల్లీి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం రాజకీయ ఆలోచనలపైనే దృష్టి పెట్టారని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. ఢల్లీిలో కేసీఆర్‌ నాలుగు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఏం చేశారని నిలదీశారు. నరేంద్రమోడీని ఎంత విమర్శిస్తే టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ కుటుంబం పట్ల ప్రజల్లో అంత వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు మంచి పనులు చేయాలని సూచించిన కిషన్‌ రెడ్డి ఏడాది తర్వాత తెలంగాణ ప్రజలు ఎలాగైనా కేసీఆర్‌ కుటుంబానికి అవకాశమివ్వరని చురకలంటించారు.