10న నిర్వహించే ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి: కన్వీనర్‌ రమణరావు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంసెట్‌-2013 ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కన్వీనర్‌ రమణారావు తెలిపారు. మే 10న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష ఉంటుందని, అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.కాగా ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 2,90,844 దరఖాస్తులు వచ్చాయని, మెడిసిన్‌, అగ్రికల్చర్‌ విభాగాలకు 1,05,024  దరఖాస్తులు వచ్చాయని,  మొత్తం 3,95868 మంది అభ్యర్థులు ఎంసెట్‌ పరీక్షకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. పదివేల రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 7 వరకు దరఖాస్తు చేసుకోంచ్చని పేర్కొన్నారు. మొత్తం ఇంజనీరింగ్‌ కోసం 534 సెంటర్లు, మెడిసిన్‌ కోసం 201 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

12న ఎంసెట్‌ ‘కీ’, జూన్‌ 2న ఫలితాలు

ఈ నెల 12న ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తామని , జూన్‌ 2న ఫలితాలను వెల్లడింస్తామని స్పష్టం చేశారు. ఈసారి అభ్యర్థుల సౌలభ్యం కోసం కొత్తగా చిత్తూరు, జనగాం, వనపర్తి,  భీమవరంలో సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కన్వీనర్‌ స్పష్టం చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అభ్యర్థులను అనుమతించబోమని ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.