10వ తరగతి విద్యార్థులకు స్పెషల్‌ టెస్టుల నిర్వహణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11: జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థుల కొరకు జిల్లా విద్యాశాఖ 2012-13 సంవత్సరానికి గాను మూడు, నాలుగు స్పెషల్‌ టెస్టులను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసచారీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు సమయసారిణి ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసి, పరీక్షలు నిర్వహించాలన్నారు. స్పెషల్‌ టెస్టు పత్రాలు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి అందిస్తామన్నారు. జనవరి 28 నుండి ఫిబ్రవరి 23 వరకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు ఫ్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.పదవ తరగతి విద్యార్థుల కొరకు జిల్లా విద్యాశాఖ పక్షాన స్టడీ మెటిరియల్‌ రూపొందించినట్లు , ఈ మెటీరియల్‌ పాఠశాలకు ఒకటి చొప్పున ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం నుండి పొందాలన్నారు. ఈ సమయసారిణిని జిల్లాలో గల అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

తాజావార్తలు