12 నుంచి శనగ పంట కొనుగోళ్లు
నాఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసిన అధికారులు
కనీస మద్దతు ధర క్వింటాకు రూ.4620 గా నిర్ణయం
ఆదిలాబాద్,మార్చి8(జనంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి శనగ పంటను కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు. నాఫెడ్ ద్వారా జల్లా వ్యాప్తంగా 8 మార్కెట్ యార్డులు, సబ్ యార్డుల్లో రైతుల వద్ద నుంచి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.4620 చొప్పున పంటను సేకరించనున్నారు. జిల్లాలో రైతులు వానాకాలంలో పత్తి, సోయాబీన్, కంది పంటలను సాగుచేస్తుండగా యాసంగిలో శనగ పంటను ఎక్కువ పండిస్తారు. ఈ సీజన్లో పంట సాగుకు వాతావరణం అనుకూలించ డంతో పంట దిగుబడి పెరిగింది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 22 వేల హెక్టార్లలో శనగ పంటను రైతులు సాగుచేయగా దాదాపు 3 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచానా వేశారు. ఎకరాకు 11 నుంచి 12 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది శనగకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.4,620గా ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు పంటల అమ్మకాల్లో నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ కొనుగోలు సంస్థ నాఫెడ్ ద్వారా ఈ సీజన్లో సోయాబిన్, కందుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. యాసంగిలో సాగు చేసిన శనగ పంట సైతం చేతికి రావడంతో అధికారులు పంట కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది క్వింటాకు రూ.4,400 ఉండగా ఈ ఏడాది క్వింటాకు రూ.220 పెరిగింది. కందుల కొనుగోళ్ల తరహాలో శనగలను సైతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నాఫెడ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్, జైనథ్, బేల, తాంసి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌లో సొసైటీల ద్వారా రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తారు. మార్కెట్ యార్డులు, ఉప మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా ఆయా మార్కెట్ యార్డు పరిధిలోకి వచ్చే రైతులు ఏ రోజు పంటను విక్రయానికి తీసుకురావాలనే తేదీని ముందుగానే తెలియజేస్తారు. రైతులు షెడ్యూల్లో సూచించిన రోజు మాత్రమే మార్కెట్ యార్డుకు పంటను తీసుకుపోవాల్సి ఉంటుంది. రైతులకు సీజన్‌కు మందుగానే సబ్సిడీపై శనగ విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు పంపిణీ చేశారు. ఆన్లైన్ విధానంలో ఈ విక్రయాలు కొనసాగగా గ్రామాల్లో ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంటను సాగుచేశాడని వివరాలు అధికారులు వద్ద ఉన్నాయి. ఈ వివరాల ఆధారంగా అసలైన రైతుల వద్ద నుంచి శనగ పంటను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం నాఫెడ్ ద్వారా పంటల కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో రైతులు తమ పంటలను మార్కెట్‌యార్డుల్లోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. సోయాబిన్, కంది పంటలను కొనుగోలు చేయడంతో రైతులకు కనీస మద్దతు ధర లభించింది.