మహాకూటమితోనే అభివృద్ది సాధ్యం

 

రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌

గోదావరిఖని, నవంబర్‌ 18, (జనంసాక్షి) :

గడిచిన నాలుగేళ్ల ప్రజాపరిపాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని రామగుండం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 18వ డివిజన్‌, గోదావరిఖని వారంతపు సంతలో ఆయన టిడిపి నేత జిమ్మిబాబుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే అనేక అభివృద్ధి పనులను చేస్తామని వాగ్దానాలతో మాత్రమే సరిపెట్టారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో రామగుండం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సంక్షేమాన్ని, ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించారన్నారు. రామగుండం నియోజకవర్గ నుంచి తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడుతానన్నారు. అదే విధంగా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలే అందేలా కృషి చేస్తానన్నారు. విద్య, వైద్య సదుపాయాలతో పాటు రామగుండం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని మక్కాన్‌ పేర్కొన్నారు. అదే విధంగా కార్పొరేషన్‌ 12వ డివిజన్‌ కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షులు కల్వల రంజిత్‌ ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి కుమారస్వామి, కాల్వ లింగస్వామి, గడ్డం శేఖర్‌, తానిపర్తి గోపాల్‌రావు, దొంతుల లింగం, ప్రకాశ్‌, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.