14న ఓబులాపూర్‌కు రానున్న ‘బాబు’ పాదయాత్ర శీకారి వెల్లడి

కరీంనగర్‌, డిసెంబర్‌ 11 : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర ఈ నెల 14న ఆదిలాబాద్‌ జిల్లాలోని కానాపూర్‌ మండలం నుండి కరీంనగర్‌ జిల్లాలో ఓబులాపూర్‌ గ్రామానికి వస్తున్నట్టు కోరుట్ల నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే శీకారి విశ్వనాధం తెలిపారు. కోరుట్లలో ఆయన మంగళవారం మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరుగుతున్నదని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే ముందుగా రైతు సమస్యలను,అటుపై ప్రజా సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని అనేక సభల్లో చెప్పారని ఆయన గుర్తు చేశారు. టిడిపి హయాంలోనే కానాపూర్‌ మండల ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, రాకపోకలు కలిగించేందుకు బారానకుర్తి వద్ద వంతెన నిర్మించారని గుర్తు చేశారు. ఈ వంతెనకు ఇరువైపుల గల గ్రామాల ప్రజల రాకపోకలకు, రైతుల పంటలకు ఎంతో ఉపయోగపడుతున్నదని అన్నారు. వస్తున్న మీకోసం యాత్రంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. బాబు చేపట్టిన యాత్రను చూసి ఓర్వలేకనే వైయస్సార్‌ సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆయనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై మొదటి నుంచి టిడిపి ఒకే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నదని, అందులో మార్పు ఏమీ లేదని ఆయన అన్నారు. ఇచ్చేది.. తెచ్చేది కాంగ్రెస్‌ పార్టీ అయినప్పుడు ఆ పార్టీపై టిడిపి విమర్శలు చేయబోదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు ధనుంజయ్‌, ప్రవీణ్‌కుమార్‌, భూమానందం, సంకు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.