14 గ్రామ పంచాయతీలను కలిపి ఎర్రవల్లిని మండలం చేయాలి

షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 5 : 14 గ్రామ పంచాయతీలను కలిపి ఎర్రవల్లిని మండలం చేయాలని షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో మండల సాధన సమితి అధ్యక్షులు పి. రాగన్న, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా ఎనిమిదవ రోజు దీక్షను షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో షేక్ పల్లె గ్రామం నుండి ఎర్రవల్లి చౌరస్తా వరకు కళాకారులతో ఊరేగింపుతో పాదయాత్రగా చేరుకొని దీక్ష కొనసాగించారు. ఈ దీక్షకు అలంపూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రాందేవ్ రెడ్డి , వైయస్సార్ తెలంగాణ పార్టీ జోగులాంబ జిల్లా నాయకుడు అతిక్ రెహమాన్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రవల్లిని మండలం చేసేందుకు భౌగోళికంగా, విస్తీర్ణంగా, జనాభాపరంగా అన్ని హంగులు కలిగి ఉందని వారన్నారు. ప్రభుత్వం స్పందించి ఎర్రవల్లి మండలం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం సాయంత్రం వరకు దీక్ష చేపట్టిన సర్పంచ్ రవీందర్ రెడ్డికి స్థానిక నాయకులు పి. రాగన్న, లోకా రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, వెంకటరెడ్డి, బండి వెంకటేశ్వర్లు ,బండి గోవిందు, కాంతారెడ్డి, కానాయిపల్లి వెంకటరాముడు, రాజశేఖర్ రెడ్డి, విక్రమ్ సేనారెడ్డి తదితర గ్రామాల ప్రజలు నాయకులు పాల్గొన్నారు.