14-16 వయసు పిల్లల్లో 34 శాతం మందికి సొంత స్మార్ట్‌ఫోన్ ఉందన్న అసర్ రిపోర్ట్
*8వ తరగతి చదివే విద్యార్థులు 2వ తరగతి పాఠం చదవలేకతున్నారు’
* ప్రభుత్వ బడులపై సర్వేలో విస్తుపోయే నిజాలు..!
* రాష్ట్రంలో పరిస్థితులపై అసర్ సర్వే
* భాగహారాలు చేయలేని వారు 61.50 శాతమని వెల్లడి
ప్రభుత్వ బడుల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో దాదాపు సగం మంది 2వ తరగతి తెలుగు పాఠాన్ని తప్పులు లేకుండా చదవలేకపోయారని అసర్(వార్షిక విద్యాస్థాయి నివేదిక) సర్వే పేర్కొంది.
ప్రైవేట్ స్కూళ్లలోని పిల్లల పరిస్థితి స్వల్పంగా మాత్రమే మెరుగ్గా ఉందని తెలిపింది.
స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ప్రథమ్ మంగళవారం 2024 సంవత్సరానికి వార్షిక విద్యాస్థాయి నివేదికను (అసర్) విడుదల చేసింది.
రాష్ట్రంలోని 270 గ్రామాల్లో 5,306 ఇళ్లకు వెళ్లి 3 నుంచి 16 ఏళ్ల వయసున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు, 14-16 ఏళ్ల వయసు వారిలో డిజిటల్ అక్షరాస్యతపై సర్వే నిర్వహించి అసర్ ఈ వివరాలను వెల్లడించింది. తీసివేతలు, భాగహారాలు చేయడంలోనూ పిల్లలు వెనుకబడి ఉన్నట్లుగా ఆ నివేదికలో పేర్కొంది. 96 శాతం మంది విద్యార్థుల ఇళ్లల్లో స్మార్ట్‌ఫోన్ ఉందని, వారిలో 74.70 శాతం మంది వాటిని బడులకు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారని వెల్లడించింది.
రాష్ట్రంలోని అసర్ సర్వేలో ఇతర ముఖ్యాంశాలు
విద్యార్థుల హాజరుశాతం 2022 సర్వేలో 75.50 శాతం ఉండగా తాజాగా అది 73.50 శాతానికి పడిపోయింది. ఉపాధ్యాయుల హాజరు గత సర్వే మాదిరిగానే 85.50 శాతంగా ఉంది.62 శాతం స్కూళ్లలో ఒకటో తరగతి పిల్లలు ఇతర తరగతుల వారితో కూర్చొని చదువుకుంటున్నారు. 61.90 శాతం బడుల్లో రెండో తరగతి పిల్లలు కూడా ఇతర తరగతుల వారితో కలిసి కూర్చొని చదువుకుంటున్నారు. 60, 60 కంటేతక్కువ పిల్లలున్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల శాతం భారీగా పెరుగుతోంది. 2010లో ఇలాంటి పాఠశాలలు 17.20 శాతం ఉండగా 2024లో 45.20 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం అని పేర్కొంది. 53.20 శాతం స్కూళ్లలో మాత్రమే తాగునీరు అందుబాటులో ఉంది.5.4 శాతం బడుల్లో శౌచాలయాలు(టాయిలెట్లు) లేవు. 18.90 శాతం పాఠశాలల్లో ఉన్నా వినియోగంలో లేవు.