18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే మునుగోడు ఉప ఎన్నిక

శంకరపట్నం, జనం సాక్షి ,అక్టోబర్ 23,
18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే పార్టీ మారి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడని రాష్ట్ర సంస్కృత సారధి చైర్మన్ ,మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలోని ధోని పాముల గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనంతో మమేకమై ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ… రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం, బిజెపి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఉపఎన్నిక తెచ్చారని అన్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన బిజెపి అభ్యర్థి మనకు అవసరం లేదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు కోరుకున్న ఉప ఎన్నిక కాదని, ధనబలంతో మునుగోడులో బిజెపి గెలవాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఒక దృఢ సంకల్పంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ లేకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని, వ్యవసాయం దండగా అని కొందరు అంటే వ్యవసాయ పండగ అని చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇంటింటా ప్రచారం నిర్వహించి తమ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఒక పార్టీ నుంచి గెలిచి కాంట్రాక్టుల కోసం సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన వ్యక్తి మునుగోడు ప్రజలకు అవసరం లేదని తీర్పు నివ్వాలని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుమల కోసం గొర్రెల పంపిణీ చేపట్టి వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందించారని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,రైతు బీమా, రైతు బంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.