20న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
అమరావతి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 20 నుంచి 23 తేదీ వరకూ సాగనున్న ఈ పర్యటనలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉప రాష్ట్రపతి పాల్గొననున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకనటలో తెలిపింది. ఈ నెల 20 వ తేదీ ఉదయం 9.25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం రన్‌ వే విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పలు పనులను ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపనలు కూడా భారత ఉప రాష్ట్రపతి చేయనున్నారు. ఈ నెల 21న నెల్లూరు జిల్లాలోని సర్దార్‌ పటేల్‌ నగర్‌ లో మెడికల్‌ క్యాంప్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం ఎఫ్‌.ఎం. రేడియో స్టేషన్‌ శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. నెల్లూరులో రైల్వే స్టేషన్‌ లో పలు అభివృద్ధి పనులతో పాటు నెల్లూరు-చెన్నై మెము ట్రైన్‌ సర్వీసును ప్రారంభించ నున్నారు. 22వ తేదీ శుక్రవారం.. స్వర్ణభారత్‌ ట్రస్టు 18వ వార్షికోత్సవ సంబరాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు. 23వ తేదీ శనివారం…స్వర్ణభారత్‌ ట్రస్టులో మెడికల్‌ క్యాంప్‌ ప్రారంభించనున్నారు. అదే రోజు తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి ఢిల్లీ పయనమవుతారు.

తాజావార్తలు