20 ఏండ్ల టిఆర్‌ఎస్ ప్రస్థానం గర్వ కారణం
చావునోట్లో తలపెట్టి రాషట్‌రం తెచ్చిన కెసిఆర్
పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలంతా పనిచేయాలి
టిఆర్‌ఎస్ నూతన కమిటీ భేటీలో మంత్రి వేముల
నిజామాబాద్,అక్టోబర్21(జనం సాక్షి ): ప్రత్యేక తెలంగాణ సాధన కోసం నాడు ఉద్యమ నాయకుడు కెసిఆర్ నాయకత్వంలో కొద్ది మందితో మొదలైన టిఆర్‌ఎస్ నేడు అతి పెద్ద పార్టీగా అవతరించిందని రాష్ట్ర రోడ్లు`భవనాలు,గృహనిర్మాణ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కెసిఆర్ తిరుగులేని నేతగా ఎదిగారని ఆయన కొనియాడారు. గురువారం బాల్కొండ నియోజకవర్గ టిఆర్‌ఎస్ పార్టీ నూతన కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. టిఆర్‌ఎస్ పార్టీ 20 ఏండ్ల ప్రస్థానాన్ని గర్వంగా చెప్పుకోవాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.పార్టీ బలోపేతం కోసం నూతనంగా ఎన్నికైన సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కెసిఆర్ స్థాపించిన టిఆర్‌ఎస్ , రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి గణనీయమైన అభివృద్ధి సాధించిందని ఆయన చెప్పారు. 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో చావు నోట్లో తలపెట్టి రాష్టాన్ని సాధించిన ఘనత కెసిఆర్ కే దక్కిందని ఆయన పేర్కొన్నారు. . సమైక్య రాష్ట్రంలో అరిగోసపడిన తెలంగాణ నేడు దేశంలోనే అన్ని
రంగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు. రైతు బంధు,రైతు భీమా,వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్,కళ్యాణ లక్ష్మీ,కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ లాంటి ఎన్నో రైతులు, పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. పార్టీకి నిజమైన సైనికులు కార్యకర్తలే అని అన్నారు. బిజెపి,కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని సరైన రీతిలో తిప్పికొట్టాలని కార్యకర్తలకు ప్రశాంత్ రెడ్డి సూచించారు.తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాల విషయంలో ఇక్కడి యువతను రెచ్చ గొడుతున్న బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు అని ప్రశ్నించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం టిఎస్ పిఎస్సి ద్వారా నే 39 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఇతర ప్రభుత్వ శాఖల్లో కలిపి మొత్తం 1లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో కేవలం 9వేల ఉద్యోగాలు భర్తీ చేసారని ఆయన పేర్కొన్నారు. కర్నాటక లో కేవలం 17 వేల ఉద్యోగాలు భర్తీ చేసారని అన్నారు. బిజెపి,కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో పెన్షన్ 400 నుంచి 500 రూ. మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ లో గనుక వాళ్లు అధికారంలోకి వస్తే అక్కడ ఇచినట్లే ఇక్కడ మళ్లీ 500 రూ. ఇస్తారా అని నిలదీయా లన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కేంద్రం గత మూడేళ్ళుగా ఒక్క పైసా ఇవ్వలేదని అన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకానికి కేంద్రానిది ఒక్క రూపాయి కూడా లేదన్నారు. కెసిఆర్ ఇచ్చే 2016/` ఆసరా పెన్షన్ లో కేంద్రం వాటా లెక్కేస్తే 45 నుంచి 50 రూ. ఉంటుందని అన్నారు. బీడీ కార్మికులకు 2016 రూ. పెన్షన్ ఇస్తున్న ఘనత కెసిఆర్ ప్రభుత్వం దేనని ఆయన అన్నారు. బిజెపి,కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో ఈ పథకం ఎందుకు లేదని ప్రశ్నించారు. దొంగ బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన దొంగ తనను విమర్శిస్తున్నాడని ఎంపి అర్వింద్ పై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టికెట్లు అమ్ముకున్న కవిూషన్ల పైసల సంచుల అక్రమ సొమ్ముతో ఎదిగింది అర్వింద్ అని దుయ్యబట్టారు. తన సొంత డబ్బు పెట్టి పార్టీ కార్యకర్తలను జడ్పీటీసీ,ఎంపీటీసీ లుగా,కౌన్సిలర్లు గా గెలిపించుకున్నది తానని మంత్రి అన్నారు. అకాల వర్షాలు, అతి వర్షాలు 30 ఏళ్ళ తర్వాత కురిసిన భారీ వర్షాలకు చెక్ డ్యాముల వద్ద కట్ట కొట్టుకుపోతే అవినీతి చేశామని మాట్లాడుతావా, చెక్ డ్యామ్ మొన్ననే పూర్‌ఖ్తెందని .ఇంకో సంవత్సరం ఆగితే దాని చుట్టూ మట్టితో పోసిన కట్ట గట్టి పడేదని, ఇంతలోపు ప్రకృతి విపత్తు వచ్చి ఇబ్బంది జరిగిందని ఆయన పేర్కొన్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. తనను విమర్శించే వారు ప్రజలకు ఏ మేలు చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తనకుందని,ఇక్కడి పేదలు, రైతుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నా, ఇన్ని రోజులు ఓపిక పట్టానని, ఇక నుంచి సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బాల్కొండ నియోజకవర్గ టిఆర్‌ఎస్ కుటుంబ సభ్యులు 50 వేల పైచిలుకు మంది ఉన్నారని, అందులో క్రియ శీలక కార్యకర్తలే 17వేల మంది ఉన్నారని మంత్రి తెలిపారు. నూతన గ్రామ,మండల కమిటీలు ప్రతిపక్ష పార్టీల అబద్దాలు తిప్పికొడుతూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నవంబర్ 15న వరంగల్ లో జరిగే పార్టీ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు బయలుదేరాలని అన్నారు. ప్రతి కార్యకర్త కథానాయకుడి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన పార్టీ వివిధ మండల, గ్రామ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.