2019 ఎన్నికలకు ముందే..

అయోధ్యలో రామమందిరం
– ఇన్నాళ్లు సహనంతో ఉన్నారు.. మరికొంతకాలం ఓపికపట్టండి
– యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌
అయోధ్య,జూన్‌26(జ‌నం సాక్షి): 2019 ఎన్నికలకు ముందే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ..  భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ఉంచి, సహనంగా ఉండాలని సంత్‌ సమ్మేళన్‌లో సాధువులకు పిలుపునిచ్చారు. రామమందిరాన్ని కూల్చడానికి మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కోర్టు ఆదేశాలతో ఏవిూ రాలేదని, అలాగే 1992లో బాబ్రీ మసీదు కూల్చడానికి కూడా కోర్టు ఆదేశాలు లేవని బీజేపీ మాజీ ఎంపీ రామ్‌ విలాస్‌ వేదాంత్‌ వ్యాఖ్యానించిన వెంటనే యోగి ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఆ ప్రదేశంలో రాముడి విగ్రహం ఎలా హఠాత్తుగా ప్రత్యక్షమైందో ఏదో ఒక రోజు మందిర నిర్మాణం కూడా అలాగే ప్రారంభం అవుతుందని వేదాంత్‌ చెప్పారు. ఆ శ్రీరాముడే ఈ విశ్వానికి దేవుడు. రాముడి ఆశీర్వాదం ఉంటే అయోధ్యలో మందిర నిర్మాణం తప్పకుండా జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి సాధువుల్లో మాత్రం ఎందుకు దీనిపై అనుమానాలు ఇన్నాళ్లూ సహనంతో ఉన్నారు. మరికొంతకాలం ఇలాగే ఉండండి అని యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. మరోవైపు అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రచారాన్ని తాము తిరిగి ప్రారంభించనున్నట్లు వీహెచ్‌పీ ప్రకటించింది. వచ్చే మూడు నెలల్లో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోతే తాము ఏంచేయాలో సాధువులను కలిసి నిర్ణయిస్తామని వీహెచ్‌పీ స్పష్టంచేంది. ప్రస్తుతం అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీదు కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.