2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

రాష్ట్రలో పార్టీ పరిస్థితులపై రాహుల్‌కు వివరించాం
తెలంగాణకు ఎక్కవ సమయం కేటాయించాలని కోరాం
రాహుల్‌తో భేటీ అనంతరం టీ కాంగ్రెస్‌ నేతలు
న్యూఢిల్లీ, జూన్‌20(జ‌నం సాక్షి) : తెలంగాణ కోసం ఎక్కువ సమయం కేటాయించాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కోరినట్లు హస్తం నేతలు తెలిపారు. బుధవారం రాహుల్‌తో టీ.కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.కె. అరుణ, రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి,  శ్రీధర్‌బాబు, కేఎల్‌ఆర్‌, బండ కార్తీకరెడ్డిలు భేటీ అయ్యారు. తొలత రాహుల్‌గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాల అందజేశారు. కాగా సుమారు 20నిమిషాల పాటు వీరు రాహుల్‌గాంధీతో భేటీ అయినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, రాష్ట్ర పార్టీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీ ఎవరిని సంప్రదించకుండానే ఉత్తమ్‌ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, తద్వారా పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. పలు విషయాలపై రాహులకు వివరించినట్లు తెలుస్తోంది. అనంతరం కాంగ్రెస్‌ నేతలు విూడియాతో మాట్లాడుతూ పార్టీ పరిస్థితిపై చర్చించడానికి 40 మందికి అవకాశం ఇవ్వాలని కోరుతూ సిద్ధం చేసిన జాబితాను రాహుల్‌ గాంధీకి ఇచ్చినట్లు కోమటిరెడ్డి చెప్పారు. 2019ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర సీనియర్‌ నేతలతో రాహుల్‌ చర్చిస్తారని తెలిపారు. వారం రోజుల్లో రాహుల్‌ సమావేశం ఉంటుందని భావిస్తున్నామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణపై దృష్టి పెట్టాలని రాహుల్‌గాంధీని కోరామని మరో నేత డీకే అరుణ తెలిపారు. ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని రాహుల్‌ను కోరామని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై గతంలో కంటే ఎక్కువ సమయంలో కేటాయించాలని రాహుల్‌ను కోరినట్లు తెలిపారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తాజా పరిస్థితులపై భేటీ చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యటించాలని రాహుల్‌ గాంధీని కోరినట్లు తెలిపారు. త్వరలో రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తారని ఆశిస్తున్నామన్నారు.