2028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే లక్ష్యంగా ఐసీసీ తీవ్రంగా కసరత్తు
2028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే లక్ష్యంగా ఐసీసీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి క్రికెట్ చేర్చాలన్న ప్రతిపాదనను ఐసీసీ పంపింది. ఈ ప్రతిపాదనపై ఐఓసీ తాజాగా స్పందించింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎందుకు చేర్చాలని భావిస్తున్నారనే దానిపై ప్రెజెంటేషన్ ఇవ్వాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐసీసీని ఆహ్వానించింది.2028లో లాస్‌ఏంజెలెస్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో 2023లో ముంబైలో ఐవోసీ సెషన్స్ నిర్వహించనుంది. ఈ సెషన్స్లో క్రికెట్‌పై ఐవోసీ నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. క్రికెట్‌తో పాటు బ్రేక్ డ్యాన్సింగ్, బేస్‌బాల్ లేదా సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోజ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్, మోటార్‌స్పోర్ట్ వంటి క్రీడలపై ఆయా క్రీడా సంఘాలు కూడా ఒలింపిక్ కమిటీ ఎదుట ప్రెజెంటేషన్ ఇవ్వనున్నాయి.లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు 28 క్రీడలు చోటు దక్కించుకున్నాయి. మరిన్ని క్రీడలను ప్రతిపాదించడానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ అవకాశం కల్పించింది. దీంతో క్రికెట్ సహా మరో తొమ్మిది క్రీడలకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే రిక్వెస్ట్ ఫర్ ఇన్‌ఫర్మేషన్ దాఖలు చేయాలని ఐసీసీని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఆదేశించింది.