25న ఆయుర్వేద ఔషద మొక్కల ప్రదర్శన

నిజామాబాద్‌, నవంబర్‌ 23 : ఆయుర్వేద వైద్యం అతి ప్రాచీనమైనదని, ప్రాచీనకాలంలో అనేక వ్యాధులకు ఆయుర్వేద వైద్యం ద్వారానే నయం చేసుకునే వారని ఆయుర్వేద వైద్య విద్వాన్‌ డా.కె.పరంధాములు తెలిపారు.  శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ మనిషి శరీర భాగంలో వాతం, పిత్తం,కప్పం అనే మూడు భాగాలు సరి సమానంగా ఉన్నప్పుడు మనిషికి ఎలాంటి రోగాలు రావని, ఎప్పుడయితే ఈ మూడు భాగాలు సమతుల్యం దెబ్బతిన్నప్పుడు వివిధ వ్యాధులు సంభవిస్తాయన్నారు. ఇలాంటి వ్యాధులకు ఆయుర్వేద రంగంలో వివిధ మొక్కల ద్వారా రోగాలు నయం అవుతాయని, ఆ మొక్కల గురించి అందరికీ తెలపాలన్న ఉద్దేశ్యంతో ఈ నెల 25న ఆదివారం బాల్‌భవన్‌లో ఆయుర్వేద ఔషధ మొక్కల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రదర్శనలో సుమారు 400 మొక్కలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, ఈ ప్రదర్శనకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరారు.