25న దుబ్బాకకు అమిత్‌షా రాక
కొత్తవారితో పోరాటానికి దిగిన బిజెపి
సిద్దిపేట,నవంబర్23(జనంసాక్షి): ఈనెల 25న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దుబ్బాకకు వస్తున్నారని ఆ పార్టీ దుబ్బాక అసెంబ్లీ స్థానం అభ్యర్థి రఘునందన్‌రావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. సభకు భాజపా రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు హాజరవుతారని తెలిపారు. దుబ్బాక బస్సు డిపో పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభ నిర్వహణకు నియోజకవర్గ పోలీసు నోడల్ అధికారి బాలాజీ, దుబ్బాక సీఐ పరశురాంతో కలిసి పరిశీలించారు. సభాస్థలి, వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్‌కు అవసరమయ్యే స్థలాన్ని పరిశీలించారు. తొలుత ఈనెల 27, 28న అమిత్‌షా బహిరంగ సభకు నిర్వహణకు తేదీలు ఖరారవగా ఆ తేదీల్లో హైదరాబాద్‌లో అమిత్‌షా రోడ్ షో, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు ఉండటంతో వాటికంటే ముందే దుబ్బాకలో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ మూడు విడతల్లో విడుదల చేసింది. పదకొండు అసెంబ్లీ స్థానాలకు గాను గజ్వేల్, నర్సాపూర్, జహీరాబాద్ మినహా మిగతా ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర నాయకుడు రఘునందన్‌రావు మాత్రమే 2014 ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేశారు. బాబుమోహన్ అందోలు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నేతలందరూ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వారే కావడం గమనార్హం. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తమ్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తున్న చాడ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ అభ్యర్థి ఆకుల రాజయ్య కొంత కాలంగా బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తూ, టికెట్ దక్కించుకున్నారు. సంగారెడ్డి నుంచి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకున్న రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే సుమారు రెండు నెలల క్రితం టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరారు. నారాయణఖేడ్ అభ్యర్థి రవికుమార్, పటాన్‌చెరు అభ్యర్థి కరుణాకర్ రెడ్డికి టికెట్ దక్కడం పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది.
ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీకి చెందిన కీలక నేతలు నామినేషన్ల నాటికి పార్టీలో చేరతారని బీజేపీ అంచనా వేసింది. టీఆర్‌ఎస్ నేతలెవరూ బీజేపీ వైపు మొగ్గు చూపక పోగా, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి ఏకంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. దుబ్బాక మినహా మిగతా అన్ని
స్థానాల్లోనూ పార్టీలో పనిచేస్తున్న వారు, కొత్తగా వచ్చి చేరిన వారికి అవకాశం ఇవ్వడం వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఎంత మేర ప్రభావం చూపుతారనే విషయాన్ని పక్కన పెడితే, ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్తగా వచ్చి చేరే వారికి ఎలాంటి అనుమానం లేకుండా టికెట్లు దక్కుతాయనే సంకేతం ఇచ్చేందుకు అసెంబ్లీ బరిలో కొత్తవారికి అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.