25 లక్షల డిమాండ్‌ను అమలు చేయాలి : తెబొగకాసం

ఆదిలాబాద్‌, జనవరి24: ప్రమాదంలో చనిపోయినా, విధి నిర్వహణలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం వెంటనే రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మ్యాచింగ్‌ గ్రాట్యూటీని చెల్లించకుండా జాతీయ కార్మిక సంఘాలు అడ్డుపడుతున్నాయని తెలంగాణ బొగ్గు గని కార్మికసంఘం విమర్శించింది. ఈ డిమాండ్‌ సాధించే వరకు తమ సంఘం దశలవారీగా ఉద్యమాలు చేస్తుందన్నారు. గని ప్రమాదం, విధి నిర్వహణలో మరణించినా సింగరేణి కార్మికులకు యాజమాన్యం మ్యాచింగ్‌ గ్రాంటు రూ.25 లక్షలు చెల్లించాలనే డిమాండ్‌తో పోరాటాలు చేస్తోందని నేతలు అన్నారు. ఇప్పటికే అనేక ఆందోళనలు చేశామని 25న జనరల్‌ మేనేజర్‌ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. ఇదిలావుంటే సింగరేణి యాజమాన్యం కోలిండియా జేబీసీసీఐ ఒప్పందాలను అమలు చేయకపోవడంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు చెప్పారు. సింగరేణి గుర్తింపు సంఘమైన తెబొగకాసం, ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్చెమ్మెస్‌లు కార్మికుల హక్కులపై చర్చించకుండా యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ పైరవీలకు పరిమితమయ్యాయని ఆరోపించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, సర్వీసు లింక్‌డు ప్రమేషన్‌ ఉత్తర్వు ప్రకారం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒప్పంద కార్మికులకు హెచ్‌పీసీ ఒప్పందం అమలు తదితర డిమాండ్ల సాధన కోసం సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులపై దశాలవారీగా ఆందోళనలు చేపడతున్నట్లు చెప్పారు. ఈనెల 27 వరకు నల్లబ్యాడ్జీల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 28న ఛైర్మన్‌కు అధికారుల ద్వారా వినతి పత్రాలు అందజేయనున్నామని, 29న జీఎం కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

తాజావార్తలు