26న కరీంనగర్‌లో కెసిఆర్ సభ
భారీగా జనసవిూకరణపై నేతల దృష్టి
కరీంనగర్,నవంబర్24(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 26న ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ మేరకు సభను పెద్దఎత్తున నిర్వహించాలని ఆ పార్టీ ముఖ్య నాయకులు నిర్ణయించారు. మొత్తం లక్షమందికి తగ్గకుండా జన సవిూకరణ చేయాలని, ఒక్కో
నియోజకవర్గం నుంచి 35 వేలకు పైగా హాజరయ్యేలా చూడాలని నిర్ణయించారు. వారికి కల్పించాల్సిన సదుపాయాలు, సభా ప్రాంగణం ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం, పార్కింగ్ వంటి సదుపాయాలపై సవిూక్షించారు. ఎస్సారార్ మైదానంలో హెలిప్యాడ్ సదుపాయం లేనందున కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ను వినియోగించుకుని రోడ్డు మార్గంలో కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకునేలా రూట్‌మ్యాప్ రూపొందించారు.
సభ నిర్వహణపై కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, స్థానిక మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, తెరాస కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు సవిూక్షించారు. సభాప్రాంగణం, జనసవిూకరణ, పార్కింగ్, హెలిప్యాడ్, చేయాల్సిన ఏర్పాట్లపై సమవేశంలో చర్చించారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం సభ నిర్వహణకు అనువుగా ఉంటుందని, అక్కడే సభను నిర్వహించాలని నిర్ణయించారు. సభ అనుమతి బాధ్యతలను మేయర్‌కు అప్పగించారు. చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, బోయినపల్లి, గంగాధర, రామడుగు మండలాల్లోని ప్రజలు, పార్టీ శ్రేణులు జగిత్యాలలో జరిగే కేసీఆర్ సభకు వెళ్లడం కొంత దూరభారంగా ఉంటున్నందున వారందరినీ కరీంనగర్‌లోని సభకు తరలించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నాలుగు మండలాలతో పాటు కరీంనగర్, మానకొండూర్ నియోజవర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొనేలా జనసవిూకరణ చేసే విషయాలపై చర్చించారు.