30న జీఎస్టీబిల్లు ఆమోదానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
హైదరాబాద్,ఆగస్టు 26(జనంసాక్షి):జిఎస్టీ బిల్లును ఆమోదించడమే లక్ష్యంగా తెలంగాణ అసెంబ్లీ ఈనెల 30న సమావేశం కానుంది. కేవలం ఒక్కరోజు మాత్రమే హాజరై బిల్లును ఆమోదించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అలాగే వినాయక చవితి సెప్టెంబర్ 5న సోమవారం కావడంతో శనివారం వరకు అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం ఉంది. ఎపి అసెంబ్లీ సమావేశాలు 8నుంచి జరుగనుండడంతో క్లాష్ కాకుండా తెలంగాణ అసెంబ్లీ ముందే ముగించనున్నారు. జీఎస్‌టీ బిల్లును ఆమోదింపజేసేందుకు సభను ప్రత్యేకంగా సమావేశపరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ కార్యదర్శి సదారామ్, మంత్రి హరీశ్‌రావులతో ముఖ్యమంత్రి సవిూక్ష నిర్వహించారు. సమావేశానికి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు స్పీకర్ మధుసూధనాచారిని సిఎం కెసిఆర్ కోరారు. 30న ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం కానున్నాయి. ఇకపోతే వినాయక ఉత్సవాల సందర్భంగా పోలీసులు బిజీగా ఉంటారు కనుక ముందే జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. 30,31,1,2,3 తేదీల్లో ఐదురోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.