31న వికలాంగుల కలెక్టరేట్‌ ముట్టడి

సంగారెడ్డి, జూలై 26 : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 31న జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ఉపాధ్యక్షులు డి.అడివయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్‌కార్డు ఇవ్వాలని, వికలాంగులందరికి పింఛన్లు ఇవ్వాలని, రద్దయిన పింఛన్లు పునరుద్దరించాలని, వికలాంగులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, 150 రోజుల పని దినాలు కల్పించాలని, బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27 నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టి 31న కలెక్టరేట్‌ కార్యాలయం ముట్టడి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వికలాంగులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అడవయ్య కోరారు.