ఆ ఇద్దరి వివరాలు తెలిపితే రూ. 5లక్షల బహుమతి
ఢిల్లీ: గుజరాత్‌లో తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్‌లో ఆమెతో పాటు కాల్పుల్లో మరణించిన మరో ఇద్దరు యువకులకు సంబంధించి వివరాలు ఏమైనా తెలియజేస్తే రూ. 5లక్షలు బహుమతి ఇస్తామని సీబీఐ ప్రకటించింది. సీబీఐ ఈ మేరకు జమ్మూకాశ్మీర్ వార్తాపత్రికల్లో ప్రకటన విడుదల చేసింది. అంజదలీరాణా, జీషన్ జోహర్ అనే ఆ ఇద్దరు యువకులు పాకిస్థాన్ జాతీయులని, లష్కరెతైబా కుట్రలో భాగంగా మోడీని హత్యచేయడానికి వచ్చారని గుజరాత్ పోలీసులు పేర్కొంటున్నారు. గుజరాత్ పోలీసులు చెప్తున్నట్లుగా వారికి నిజంగా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే విషయంలో సీబీఐ తన దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని పేర్కొంటూ సీబీఐ ఇటీవలే తొలి చార్జిషీటును దాఖలు చేసిన సంగతి తెలిసిందే.