5గంటలకల్లా ప్రచారం సమాప్తం : బన్వర్‌లాల్
హైదరాబాద్, జూన్ 9 :
ఆదివారం సాయంత్రం 5 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ చెప్పారు. సచివాలయంలో శనివారంనాడు విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరగనున్న ప్రాంతాలతో సంబంధం లేని వ్యక్తులు ఆ ప్రాంతాలను విడిచి వెళ్లిపోవాలన్నారు. ఈ విషయంపై ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్‌పిలకు ఆదేశాలిచ్చామన్నారు. ఎస్‌పిలతో, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించామన్నారు. కొందరు అదనపు బలగాలను కోరారని, ఆయా ప్రాంతాలకు కేంద్ర బలగాలను తరలిస్తున్నామని చెప్పారు. కేంద్రం నుంచి 138 కంపెనీల బలగాలు ఎన్నికలు జరిగే ప్రాంతాల భద్రత నిమిత్తం వచ్చాయన్నారు. అంతేగాక ఎన్నికలు జరగని ప్రాంతాల్లో ఉన్న పోలీసుల సేవలను కూడా వినియోగించుకుంటున్నామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పోలీసులకు, అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. శనివారం సాయంత్రం వరకు ఉప ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో రూ.40.50 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేగాక రూ.12.69 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 1.91 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 33,585మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. పోలింగ్ సమయంలో అభ్యర్ధి ఒక వాహనం మాత్రమే వినియోగించుకోవాలని సూచించా మని చెప్పారు.