51 మందిని స్వదేశానికి చేర్చిన ఈటీసీఏ
– గల్ఫ్‌లో చిక్కుకున్న వారి జీవితాల్లో వెలుగులు
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
విజిటింగ్ వీసాలతో గల్ఫ్ దేశాలకు వెళ్లి తిరిగి వచ్చేందుకు డబ్బులు లేక నానా అగచాట్లు పడుతున్న వారికి ఆపద్బంధువుగా నిలిచింది ఎమిరైట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ఈటీసీఏ). స్వదేశంలో ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్‌కు చేరిన అభాగ్యులు అక్కడ పనిచేయలేక దొంగల్లా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించారు. ఉన్న కాస్త భూమిని, భార్య మెడలో నగలను అమ్మి ఆ మొత్తం ఏజెంట్ల చేతిలో పోసి ఉపాధి వెదుక్కుంటూ గల్ఫ్‌కు వచ్చిన వారిలో వేలాది మందిని తిరిగి వెళ్లిపోవాలని, లేకుంటే అరెస్టు చేసి జైళ్లలో పెడతామని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. ఆమెస్టీ ప్రక్రియ పూర్తి చేసేందుకు గడువు కూడా ప్రకటించింది. ఒకవైపు గడువు ముంచుకురావడం చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో వలస జీవుల బతుకులు ఇరకాటంలో పడ్డాయి. అసలు ప్రాణాలతో ఊరికి చేరుతామా? భార్యాబిడ్డలను మళ్లీ చూడగలమా? అనే అనుమానంతో పలువురు సగం చిక్కిపోయ్యారు. ఇలా వెళ్లిన వారిలో తెలంగాణ జిల్లాల నుంచి పొట్టచేతబట్టుకొని వెళ్లిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇక తమ జీవితాలు గల్ఫ్ జైళ్లకే పరిమితమవుతాయనుకునే సమయంలో వారిని ఆదుకునేందుకు ఈటీసీఏ వివిధ వర్గాల నుంచి విరాళాలు సేకరించి, స్వయంగా కొంత మొత్తం సమకూర్చి ఇప్పటి వరకు 51 మందిని భారత్‌కు పంపింది. ఈనెల 11, 13, 15 తేదీల్లో ఈటీసీఏ ఆరుగురికి టికెట్లు, రిటర్న్ వీసా సమకూర్చి స్వదేశానికి పంపింది. స్థానిక ఎన్‌ఆర్‌ఐల ఫోరం సౌజన్యంతో మరో ఐదుగురిని స్వస్థలాలకు పంపింది. వారంతా ఈటీసీఏ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపి గల్ఫ్‌లో విమానమెక్కారు. విరాళాలు ఇచ్చిన దాతలకు, తమ తాపత్రయాన్ని గుర్తించి సహకరించిన వారికి ఎమిరైట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్‌కుమార్ పీచర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.