6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన
ధాన్యం సేకరణ ఆలస్యంతో ఇక్కట్లు
కామారెడ్డి,నవంబర్6 ,( జనం సాక్షి ): జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్‌లో లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. విస్తారంగా వర్షాలు కురువడంతో భారీగా దిగుబడులు వస్తాయని సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 343 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఈసారి వరి కోతలు ముందుగానే జరిగాయి. గత 15 రోజుల నుంచి రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తున్నారు. 10 రోజుల నుంచి కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం చేరుతుంది. అయితే ఇప్పటి వరకు 150 కేంద్రాలను మాత్రమే అధికారులు ప్రారంభించారు. పూర్తిస్థాయిలో కేంద్రాలు తెరుచుకోక పోవడంతో కొనుగోళ్లు చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. బాన్సువాడ డివిజన్‌లో మాత్రమే ముందుగా కేంద్రాలను ప్రారంభించారు. ఎల్లారెడ్డి డివిజన్‌లో ఇప్పుడిప్పుడే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి
వరకు 150 కేంద్రాల్లో సుమారు 18వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సంబంధిత శాఖ అధికారులు కొనుగోలు చేశారు. జిల్లాలో ప్రభుత్వం తరపున 343 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 15 రోజుల నుంచి కేంద్రాలకు పెద్ద ఎత్తున రైతులు ధాన్యాన్ని తరలిస్తున్నారు. గతంలోనూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం నెలకొనడం, గోనె సంచుల కొరత, ట్రాన్స్‌పోర్ట్ సమస్య లాంటి కారణాలతో కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి. ప్రతీ సీజన్‌లోనూ కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించామంటూ అధికారులు చెబుతున్న అది కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నెలకొనడం కేంద్రాల్లో కుప్పల వద్ద రైతులు రాత్రింబవళ్లు కాపలాకాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేస్తారో లేదో అనే దిగులుతో ఉన్నారు.