భారత్‌ షెడ్యూల్‌ ప్రకటించిన


సఫారీ క్రికెట్‌ బోర్డ్‌

కేప్‌టౌన్‌ ,జూలై 8 (జనంసాక్షి):

తమ దేశంలో భారత జట్టు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ క్రికెట్‌ సౌతాఫ్రికా ప్రకటించింది. దీని ప్రకారం సఫారీ టూర్‌లో టీమిండియా రెండు టీ ట్వంటీలు , ఏడు వన్డేలతో పాటు మూడు టెస్టులు ఆడనుంది. నవంబరి 18న సౌతాఫ్రికా ఎలెవన్‌తో జరిగే టూర్‌ మ్యాచ్‌తో భారత జట్టు పర్యటన షురూ కానుంది. రెండు టీ ట్వంటీలు ఆడిన తర్వాత ఏడు వన్డేల సిరీస్‌ నవంబర్‌ 27 నుండి మొదలవుతుంది. ఏడు వన్డేల సిరీస్‌కు డర్బన్‌ , పోర్ట్‌ఎలిజిబెత్‌ , ఈస్ట్‌లండన్‌ సెంచూరియన్‌ , జోహెనస్‌బర్గ్‌ , బ్లూఫౌంటైన్‌ , కేప్‌టౌన్‌ వేదికలుగా నిలవనున్నాయి. ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత టీమిండియా రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుండగా… డిసెంబర్‌ 26 నుండి బాక్సింగ్‌ డే మ్యాచ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుందని సౌతాఫ్రికా బోర్డ్‌ తెలిపింది. డర్బన్‌ , కేప్‌టౌన్‌ , జోహెనస్‌బర్గ్‌ టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. భారత పర్యటన ముగిసిన 15 రోజులకు ఆస్టేల్రియా జట్టు సఫారీ టూర్‌కు రానుంది. ఈ పర్యటనలో ఆస్టేల్రియా మూడు టెస్టులు , మూడు టీ ట్వంటీలు ఆడనున్నట్టు సఫారీ క్రికెట్‌ బోర్డ్‌ వెల్లడించింది.