ఫైనల్‌కు చేరువైన శ్రీలంక

    

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌

జూలై 9  (జనంసాక్షి):

ముక్కోణపు సిరీస్‌ ఊహించని మలుపులు తిరుగుతూ సాగుతోంది. నిన్నటి వరకూ పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న వెస్టిండీస్‌ ఇప్పుడు టోర్నీ నుండి నిష్కమ్రించే పరిస్థితి తెచ్చుకుంది. ఇదంతా శ్రీలంకతో మ్యాచ్‌లో ఓడిపోవడమే కారణం. వరుణుడి కారణం గా రిజర్వ్‌ డే రోజున కొనసాగిన మ్యాచ్‌లో లంక 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు విసిరిన 230 (డక్‌వర్త్‌ లూయీస్‌ విధానం ప్రకారం) పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్‌ విఫల మైంది. సొంతగడ్డపై కరేబియన్‌ బ్యాట్స్‌మెన్‌ మరోసారి తమ పేలవమైన ఆటతీరుతో నిరాశపరి చారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నప్పటకీ… పరుగులు చేయడంలో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందిపడ్డారు. దీనికి తోడు లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌ 14, ఛార్లెస్‌ 14 పరుగులకే ఔటయ్యాక… విండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. స్మిత్‌, శామ్యూల్స్‌ డకౌటవడంతో ఆ జట్టు 31 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డారెన్‌ బ్రేవో, సిమ్మన్స్‌ విండీస్‌ను ఆదుకున్నారు. హాఫ్‌ సెంచరీలతో రాణించిన వీరిద్దరూ ఐదో వికెట్‌కు 123 పరుగులు జోడించడంతో కోలుకున్నట్టు కనిపించింది. అయితే ఎరంగా బౌలింగ్‌లో సిమ్మన్స్‌ ఔటవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వెంటనే పొల్లార్డ్‌ డౌకటవగా… సామి మూడు పరుగులకే వెనుదిరగడంతో లంక గెలుపు ఖాయమైంది.టెయిలెండర్ల సపోర్ట్‌ లేకపోవడంతో బ్రేవో కూడా ఔటయ్యాడు. చివరికి వెస్టిండీస్‌ 41 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బౌలర్లలో మాథ్యూస్‌ 4, ఎరంగా 3, మలింగ 2 వికెట్లు పడగొట్టారు. సంగక్కరాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.

ఎవరి పరిస్థితి ఏంటి ?

విండీస్‌పై లంక గెలుపుతో ట్రై సిరీస్‌ అనూహ్య మలుపు తిరిగింది. ప్రస్తుతం మూడు జట్లకూ ఫైనల్‌ అవకాశాలు ఉన్నాయి. వీటిలో శ్రీలంక జట్టు దాదాపుగా ఫైనల్‌ చేరినట్టే.. పాయింట్ల పట్టికలో లంక 9 పాయింట్లతో ఉండగా విండీస్‌ కూడా 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇవాళ శ్రీలంకతో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ బోనస్‌ పాయింట్‌తో గెలిస్తే మనతో పాటు లంక కూడా ఫైనల్‌ చేరుకుంటుంది. బోనస్‌ పాయింట్‌తో గెలవకున్నా విండీస్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌తో భారత్‌ గెలిచినా ఫైనల్‌ బెర్త్‌ దక్కుతుంది. ఒకవేళ శ్రీలంక గెలిచినా…మ్యాచ్‌ వర్షంతో రద్దైనా టీమిండ ియా ఇంటిదారి పట్టాల్సిందే. ప్రస్తుతం శ్రీలంక రన్‌రేట్‌ ్శ1.019 ఉండగా విండీస్‌ 0.383 రన్‌రేట్‌తోనూ, భారత్‌ 0.524 రన్‌రేట్‌తోనూ ఉన్నాయి.