ఫిక్సింగ్‌ అంపైర్లపై లంక బోర్డు నిషేధం


కొలంబో ,జూలై 9 (ఆర్‌ఎన్‌ఎ):

మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతూ స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికిపోయిన తమ అంపైర్లపై శ్రీలంక క్రికెట్‌ బోర్డ్‌ కొరడా ఝుళిపించింది. వారిని అంపైరింగ్‌ నుండి నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. శ్రీలంకకు చెందిన అంపైర్లు సాగర గాలగే , మారిస్‌ డి లా జిల్వా గత ఏడాది అక్టోబర్‌లో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లకు సంబంధించి ఫిక్సింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపారు. భారత్‌కు చెందిన ఒక న్యూస్‌ ఛానెల్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఈ విషయం వెలుగు చూసింది. ఆ స్టింగ్‌ ఆపరేషన్‌లో శ్రీలంక, పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురు అంపైర్లు దొరికిపోయారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన లంక బోర్డు తమ అంపైర్లలో సాగర గలాగేను 10 ఏళ్ళు, డి లా జిల్వాను మూడేళ్ళ పాటు నిషేధిస్తున్నట్టు తెలిపింది. మరో అంపైర్‌ గామిని డిసానాయకే మాత్రం నిషేధం వేటు నుండి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అయితే విచారణలో ముగ్గురూ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో అంపైరింగ్‌ నిర్వర్తిస్తున్న వీరు ఉధ్ధేశపూర్వకంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు అంగీకరించినట్టు స్టింగ్‌ ఆపరేషన్‌లో నెల్లడైంది.