భారత హాకీ జట్టు కోచ్‌ నాబ్స్‌పై వేటు


న్యూఢిల్లీ ,జూలై 9 (ఆర్‌ఎన్‌ఎ):

ఇండియన్‌ హాకీ టీమ్‌ వరుస వైఫల్యాలకు కోచ్‌ మైకేల్‌ నాబ్స్‌ మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు ప్రదర్శన సరిగా లేని కారణంగా కోచ్‌ నాబ్స్‌పై హాకీ ఇండియా వేటు వేసింది. గత 12 నెలల కాలంకో భారత హాకీ జట్టు ప్రదర్శనపై హాకీ ఇండియాతో కలిసి సవిూక్ష నిర్వహించిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాప్‌) రివ్యూ విూటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకుంది. జట్టు ప్రదర్శన దిగజారడంతో నాబ్స్‌ను కొనసాగించేందుకు శాప్‌తో పాటు హాకీ ఇండియా సిధ్ధం లేదని , దీంతో అతన్ని తప్పిస్తున్నట్టు కార్యదర్శి నరేంద్ర బత్రా చెప్పారు. నాబ్స్‌ 2011లో జాతీయ జట్టు కోచ్‌గా నియమితుడయ్యాడు. 2016 వరకూ అతనికి కాంట్రాక్ట్‌ ఇచ్చినప్పటకీ… ప్రస్తుతం దానిని రద్దు చేసినట్టు తెలుస్తోంది. నాబ్స్‌ కోచింగ్‌లో భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయం ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాలేకపోయిన మన జట్టు గత ఏడాది లండన్‌ ఒలింపిక్స్‌ కోసం నిర్వహించిన క్వాలిఫైయింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచింది. అయితే ఒలింపిక్స్‌లో ఒక్క విజయం కూడా సాధించకుండానే ఇంటిదారి పట్టింది. అలాగే ఎఫ్‌ఐహెచ్‌ వరల్డ్‌ లీగ్‌ రౌండ్‌లో కూడా ఆరో స్థానంలో నిలిచింది. నాబ్స్‌పై వేటు వేయడంతో జట్టు బాధ్యతలను తాత్కాలికంగా హాకీ ఇండియా హై పెర్ఫార్మెన్స్‌ మేనేజర్‌ రోలెంట్‌ ఆల్ట్‌మాన్స్‌కు అప్పగించారు. ప్రస్తుతం బెంగళూర్‌లో జరుగుతోన్న నేషనల్‌ క్యాంప్‌కు అతనే పర్యవేక్షకునిగా ఉన్నాడు.