ఫ్రాన్స్‌లో యువీ-జహీర్‌ ప్రాక్టీస్‌

      
పారిస్‌ ,జూలై 10 (జనంసాక్షి):

జాతీయ జట్టుకు దూరమైన వరల్డ్‌కప్‌ స్టార్‌ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌ , జహీర్‌ఖాన్‌ రీ ఎంట్రీపై దృష్టి పెట్టారు. 2015 ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా సిధ్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఫ్రాన్స్‌లో ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. గత ఏడాది కాలంగా ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతోన్న వీరిద్దరూ ప్రత్యేకంగా ఫ్రెంచ్‌ పర్యవేక్షకుని ఆధ్వర్యంలో శ్రమిస్తున్నారు. యువరాజ్‌సింగ్‌ చివరిసారిగా జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. ఆ సిరీస్‌లో కేవలం ఒకే హాఫ్‌ సెంచరీ సాధించడంతో ఛాంపియన్స్‌ ట్రోఫీకి సెలక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. దీంతో వచ్చే అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే ఆస్టేల్రియా పర్యటనకు ఎంపిక కావాలని యువీ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించడమే తన మొదటి లక్ష్యమని , దీని కోసమే ప్రత్యేక ట్రైనర్‌ను నియమించుకున్నట్టు ఒక వార్తపత్రికకు ఈమెయిల్‌ ద్వారా ఇచ్చిన ఇంటర్యూలో యువీ వెల్లడించాడు. ప్రతీ రోజూ ఐదు గంటల పాటు ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నట్టు వివరించాడు. జహీర్‌ కూడా తనతో పాటే ప్రాక్టీస్‌ చేస్తున్నాడని తెలిపాడు. ఆసీస్‌ టూర్‌కు ముందు జరిగే డొమెస్టిక్‌ క్రికెట్‌లో సత్తా చాటడం ద్వారా సెలక్టర్ల దృష్టిలో పడాలనుకుంటున్నట్టు యువీ చెప్పాడు. 2015 ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యమని తెలిపాడు. అటు జహీర్‌ కూడా జాతీయ జట్టులో పునరాగమనం కోసం దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు సిధ్దమవుతున్నాడు.