టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ళ జోరు


దుబాయ్‌ ,జూలై 22 (జనంసాక్షి) :

ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ళు దూసుకెళుతున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న యాషెస్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో తాజా జాబితాలో ఆ టీమ్‌ ప్లేయర్స్‌ ముందంజ వేశారు. రెండో టెస్టులోనూ తన ఫామ్‌ కొనసాగించిన ఇయాన్‌ బెల్‌ ఆరు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకులో నిలిచాడు. పదో ర్యాంకులో ఉన్న టేలర్‌ కంటే మూడు రేటింగ్‌ పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉండడం విశేషం.లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్టులో బెల్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేశాడు. అలాగే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన ఓపెనర్‌ జో రూట్‌ ఏకంగా 21 స్థానాలు మెరుగై 26వ ర్యాంకు దక్కించుకున్నాడు. టాప్‌ థర్టీలో ఆరుగురు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఉండడం విశేషం. లార్డ్స్‌ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిన రూట్‌ 180 పరుగులు చేశాడు. అలాగే హాఫ్‌ సెంచరీతో రాణించిన జానీ బెయిర్‌స్టో 12 స్థానాలు ఎగబాకాడు. తాజా జాబితాలో బెయిర్‌స్టో 53వ ర్యాంకులో నిలిచాడు. కాగా బ్యాటింగ్‌ విభాగంలో సౌతాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా , విండీస్‌ క్రికెటర్‌ శివనారాయణ్‌ చంద్రపాల్‌ తొలి రెండు స్థానాల్లో కొనసా గుతున్నారు. బౌలింగ్‌లోనూ ఇంగ్లాండ్‌ ప్లేయర్స్‌ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. యాషెస్‌ సిరీస్‌లో తన స్వింగ్‌ మ్యాజిక్‌తో అదరగొడుతోన్న జేమ్స్‌ ఆండ ర్సన్‌ ఒక స్థానం మెరుగై ఐదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానంలో ఉన్నాడు. లార్డ్స్‌ టెస్టులో స్వాన్‌ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే టాప్‌ టెన్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు చటేశ్వర పుజారా ఆరో స్థానంలో ఉండగా.. బౌలింగ్‌లో మాత్రం ఇద్దరు భారత ప్లేయర్లకు టాప్‌ టెన్‌లో చోటు దక్కింది. హైదరాబాదీ స్పిన్నర్‌ ప్రగ్యాన్‌ ఓజా ఆరో స్థానంలోనూ , మరో స్పిన్నర్‌ అశ్విన్‌ ఎవినిదో స్థానంలోనూ ఉండగా… పేస్‌ బౌలర్‌ జహీర్‌ఖాన్‌ 17వ ర్యాంకులో ఉన్నాడు.