ఐబీఎల్ ఆక్షన్‌లో లీ చాంగ్‌వీ, సైనాలే టాప్
న్యూఢిల్లీ ,జూలై 22 (జనంసాక్షి) :
ఐపీఎల్ తరహాలో బ్యాడ్మింటన్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఇండి యన్ బ్యాడ్మింటన్ లీగ ్(ఐబీఎల్) వేలంలో మలే షియా స్టార్ ఆటగాడు లీ చాంగ్‌వీ , హైదరాబాదీ షట్లర్ సైనానెహ్వాల్ అత్యధిక ధర పలిచారు. వరల్డ్ నెంబర్ వన్ లీ చాంగ్‌వీని ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ 80.2 లక్షలకు దక్కించుకుంది. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ , టాలీవుడ్ హీరో నాగార్జున , మరో మాజీ క్రికెటర్ చాముండేశ్వర్‌నాథ్ ఈ ఫ్రాంచైజీ ఓనర్లుగా ఉన్నారు. లీ చాంగ్ వీ కోసం ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్టు పోటీపడడంతో అతనికి మంచి ధర లభించింది. అటు వేలంలో రెండో స్థానంలో నిలిచిన సైనానెహ్వాల్ 72 లక్షలు పలికింది. ఆమెను పివిపి గ్రూప్ హైదరాబాద్ హాట్ షాట్స్ సొంతం చేసుకుంది. సైనా కనీసధర 30 లక్షలు. చైనా క్రీడాకారులు ఐబీఎల్‌కు దూరంగా ఉండడంతో అందరి చూపూ భారత ఆటగాళ్ళపైనే నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో తెలుగుతేజం పారుపల్లి కష్యప్‌ను బెంగళూర్ ఫ్రాంచైజీ బంగా బీట్స్ 44 లక్షలకు సొంతం చేసుకోగా… మరో తెలుగుతేజం పివి సింధు అతని కంటే ఎక్కువ ధర పలికింది. సింధును 47 లక్షలకు లక్నో వారియర్స్ దక్కించుకోవడం విశేషం. ఈ ఆక్షన్‌లో వియాత్నాం ప్లేయర్ టిన్ మిన్ కోసం ఢిల్లీ , పుణెళి ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 25వేల డాలర్ల బేస్‌ప్రైస్ కలిగిన టిన్‌ను పుణెళి ఫ్రాంచైజీ 26 లక్షలకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే వరల్డ్ నెంబర్ 7 టిన్ బాన్‌ను 30వేల డాలర్లకు ముంబై మాస్టర్స్ దక్కించుకుంది. అటు ఇండోనేషియా స్టార్ తౌఫిక్ హిదాయత్‌ను 15వేల డాలర్లకు హైదరాబాద్ హాట్‌షాట్స్ కొనుగోలు చేసింది. ఈ మాజీ ఛాంపియన్ కోసం ఏ ఫ్రాంచైజీ పోటీపడకపోవడం విశేషం.
పాపం జ్వాల – అశ్విని ః
ఐబీఎల్ ఆటగాళ్ళ వేలంలో భారీగా ధర పలుకుతారనుకున్న గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు నిరాశే మిగిలింది. లీగ్‌లో మహిళల డబుల్స్ మ్యాచ్‌లు లేకపోవడంతో ఏ ఫ్రాంచైజీ కూడా వీరిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో వీరిద్దరి కనీసధరను తగ్గించి వేలంలో ఉంచారు. తర్వాత ఢిల్లీ స్మాషర్స్ 31 వేల డాలర్లకు జ్వాలను దక్కించుకోగా…పుణె పిస్టన్స్ 25 వేల డాలర్లకు అశ్వినిని కొనుగోలు చేసింది. అయితే జ్వాల-అశ్వినిలకు తాము నష్టపరిహాలం చెల్లిస్తామని ఐబీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. బేస్ ప్రైస్‌లో వారు కోల్పోయిన మిగిలిన మొత్తాన్ని ఐబీఎల్ వీరిద్దరికీ చెల్లించనుంది. ఇక నాలుగుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు చేతన్ ఆనంద్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. చేతన్ ఆనంద్ కనీసధరను 7500 డాలర్లుగా నిర్ణయించినప్పటకీ వేలంలో అమ్ముడవలేదు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ తొలి సీజన్ ఆగష్ట్ 24 నుండి ప్రారంభం కానుండగా… మొత్తం ఆరు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. తొలి సీజన్ ఆక్షన్‌లో 66 స్థానాల కోసం 150 ప్లేయర్లు పోటీపడ్డారు.
ఐబీఎల్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్లేయర్స్ వీరే ః
సైనానెహ్వాల్ (120,000 డాలర్లు) , తౌఫిక్ హిదాయత్ (15000 డాలర్లు), అజయ్ జయరామ్ (25000 డాలర్లు),వి షెమ్ గో (10000 డాలర్లు) , తరుణ్ కోన (38000 డాలర్లు) , ప్రద్య్నా గాద్రే (46000 డాలర్లు), కిమ్ వా లిమ్ (10000 డాలర్లు) , తానోన్‌సక్ (15000 డాలర్లు) , కాంతి విశాలాక్షి (3000 డాలర్లు), శుభంకర్ దే (3000 డాలర్లు)