నాలుగో వన్డేలో పాకిస్థాన్ గెలుపు
సెయింట్ లూసియా ,జూలై 22 (జనంసాక్షి) : కరేబియన్ గడ్డపై జరుగుతోన్న వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ మరో విక్టరీ కొట్టింది. సెయింట్ లూసియా వేదికగా ముగిసిన నాలుగో వన్డేలో 6 వికెట్ల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 49 ఓవర్లలో 7 వికెట్లకు 261 పరుగులు చేసింది. వర్షం కారణంగా మొదట ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. విండీస్ జట్టులో మార్లోన్ శామ్యూల్స్ సెంచరీతో రాణించాడు. పాక్ ఇన్నింగ్స్ మొదలవడానికి ముందు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో 45 నిమిషాలకు పైగా ఆట తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పాక్ లక్ష్యాన్ని 31 ఓవర్లలో 189 పరుగులుగా నిర్ణయించారు. ఓపెనర్ అహ్మద్ త్వరగానే ఔటైనప్పటకీ… జంషెడ్ , మహ్మద్ హఫీజ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. జంషెడ్ రనౌటైనా…హఫీజ్ , మిస్బాబుల్ ధాటిగా ఆడారు. దీంతో పాక్ విజయం దిశగా సాగింది. మిస్బా , హఫీజ్ మూడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. విజయానికి మరో 57 పరుగులు చేయాల్సి ఉండగా… హఫీజ్ (59) , అఫ్రిది (7) ఔటవడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఉమర్ అక్మల్ ధాటిగా ఆడి పాక్ విజయాన్ని తేలిక చేశాడు. దీంతో పాకిస్థాన్ 30 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మిస్బాబుల్ 53(3 ఫోర్లు, 1సిక్సర్) , ఉమర్ అక్మల్ 29(4 ఫోర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. విండీస్ సెంచరీ హీరో శామ్యూల్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో పాక్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.