అవకాశమివ్వండి… ఫలితాలు చూపిస్తా

న్యూఢిల్లీ ,జూలై 22  (జనంసాక్షి) : భారత హాకీ జట్టు కోచ్‌గా తనకు అవకాశమిస్తే ఏడాదిలో అద్భుతమైన ఫలితాలు చూపిస్తానంటున్నాడు మాజీ కెప్టెన్‌ ధన్‌రాజ్‌ పిళ్ళై. జాతీయ జట్టు హాకీ టీమ్‌కు విదేశీ కోచ్‌ను నియమించడాన్ని ఎప్పుడూ వ్యతిరేకించే పిళ్ళై స్వదేశంలో మంచి కోచ్‌లు ఇంకా బతికే ఉన్నారన్నాడు. భారత హాకీ జట్టుకు విదేశీ కోచ్‌ అవసరం లేదని , వారి కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారంటూ విమర్శించాడు. గతంలో గెరార్డ్‌ రాచ్‌ , ఇటీవల మైకేల్‌ నాబ్స్‌ను నియమించి ఏం ఫలితాలు రాబట్టారో అందరికీ తెలిసిందన్నాడు. దేశంలో అత్యుత్తమ కోచింగ్‌ ఇచ్చే వ్యక్తులు ఇంకా చనిపోలేదని , తనకు ఒక్క అవకాశమిస్తే ఏడాది తిరిగే లోపు మంచి ఫలితాలు రాబడతానని చెప్పాడు. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా టీమ్‌కు ధనరాజ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. హాకీ ఇండియా తనను ఎంపిక చేసి , స్వతంత్య్ర ¬దానిస్తే జాతీయ క్రీడను మళ్ళీ మెరిపిస్తానని చెబుతున్నాడు. ఇటీవల మైకేల్‌ నాబ్స్‌పై వేటు వేసిన తర్వాత భారత హాకీ కోచ్‌ పదవి ఖాళీ అయింది. అయితే మళ్ళీ విదేశీ కోచ్‌ను నియమించేందుకే హాకీ ఇండియా ఆసక్తి చూపిస్తుండడంతో మాజీ ఆటగాళ్ళు విమర్శలు కురిపిస్తున్నారు. కేవలం భారత కోచ్‌ మాత్రమే మన ఆటగాళ్ళను అర్థం చేసుకుంటాడని పిళ్ళై తెలిపాడు. జట్టులో 60 శాతానికి పైగా ఆటగాళ్ళు విదేశీ కోచ్‌ భాష అర్థం చేసుకోలేరని , ఫలితాలపై దీని ప్రభావమే ఎక్కువ ఉంటుందని వ్యాఖ్యానించాడు