మ్యాచ్‌ఫిక్సింగ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు
న్యూఢిల్లీ ,జూలై 22 (జనంసాక్షి) : క్రికెట్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన 2000 మ్యాచ్‌ఫిక్సింగ్ కేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దాదాపు 13 ఏళ్ళ సుధీర్ఘ విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ ఫైల్ చేయడం విశేషం. ఈ కేసులో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హ్యాన్సీ క్రోనేను ప్రధాన నిందితునిగా చేర్చారు.2000 సంవత్సరంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డేలో ఫిక్సింగ్ జరిగింది. లండన్‌కు చెందిన బుకీ సంజీవ్‌చావ్లా ఫోన్ సంభాషణల ద్వారా ఈ విషయం బయటపటింది. మ్యాచ్‌ఫిక్సింగ్ చేసేందుకు సౌతాఫ్రికా సారథి క్రోనేతో బుకీ సంజీవ్ చావ్లా జరిపిన సంభాషణను ప్రధాన సాక్ష్యంగా తీసుకున్నారు.దీని ప్రకారం మ్యాచ్‌కు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే లీక్ చేసేందుకు క్రోనే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నిమిత్తం సదరు బుకీ నుండి 15 వేల డాలర్లు తీసుకున్నాడు. అయితే ప్రారంభంలో ఈ ఆరోపణలను ఖండించిన క్రోనే తర్వాత విచారణ కమిటీ ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. దీంతో ఈ సౌతాఫ్రికా కెప్టెన్‌పై జీవితకాల నిషేధం విధించారు. కాగా 2002లో హెలికాఫ్టర్ ప్రమాదంలో క్రోనే దుర్మరణం పాలయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో హ్యాన్సీ క్రోనేను ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు. దాదాపు 2000 పేజీలతో కూడిన ఈ ఛార్జ్‌షీట్‌లో ఫోన్ డేటా రికార్డ్స్ , వాయిస్ శాంపిల్ టెస్ట్ రిపోర్ట్స్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారి బ్యాంకు ఖాతాల వివరాలు ,. బుకీల సాక్ష్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదే మ్యాచ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న సఫారీ క్రికెటర్లు నికీ బోయే , హెర్ష్‌లే గిబ్స్ పేర్లు దానిలో లేకపోవడం విశేషం. బుకీలతో ఒప్పందం కుదుర్చుకున్న వీరిద్దరూ స్థాయికి తగినట్టు ఆడకుండా ఉండేందుకు 15 వేల డాలర్ల చొప్పున తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే విచారణలో ఇవి రుజువు కాకపోవడంతో వారి పేర్లు ఛార్జ్‌షీట్‌లో చేర్చలేదు.ఇక ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న భారత క్రికెటర్లు అజారుద్దీన్, జడేజా పేర్లు కూడా దీనిలో లేవు. ఇదిలా ఉంటే ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ వివాదంపై కూడా ఢిల్లీ పోలీసులు వచ్చే వారం ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.