ప్రముఖ నటి మంజుల కన్నుమూత


చెన్నయ్‌, జూలై 23 (జనంసాక్షి) :
ప్రముఖ నటి మంజుల (60) మంగళవారం ఉదయం 11.40 గంటల సమయంలో రామచంద్ర ఆసుపత్రిలో కన్నుమూశారు. వారం రోజుల క్రితం ఆమె కింద పడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి చెయ్యిదాటిపోవడంతో ఆమె మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మంజుల 1953, జూలై 3వ తేదీన జన్మించారు. మంజుల మృతి వార్త తెలియగానే సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా, మంజూరు సుమారు 200లకు పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించారు. ఆనాటి తెలుగు, తమిళ, కన్నడ అగ్ర నటులతో నటించారు. శోభన్‌బాబు-మంజులది హిట్‌ కాంబినేషన్‌గా నిలిచింది. అలాగే కృష్ణ సరసన కూడా ఆమె అనేక చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు సరసన కూడా పలు చిత్రాల్లో నటించారు. 1969లో శాంతినిలయం చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆమె చివరిసారిగా వాసు చిత్రంలో నటించారు. కృష్ణతో నటించిన మాయదారి మల్లిగాడు చిత్రం మంజులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1992లో చంటి సినిమాలో వెంకటేశ్‌తో, హీరోయిన్‌ మీనాకు వదినగా నటించారు. అలాగే 2002లో వెంకటేశ్‌ హీరోగా వాసు సినిమాలో ఆమె తల్లి పాత్ర వేశారు. మంజుల ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. మంజులకు వనిత, ప్రీతి, శ్రీదేవి అనే ముగ్గురు కుమార్తెలు. వారిలో ఇద్దరు పలు సినిమాల్లో నటించారు. ఎదురులేని మనిషి, బంగారు బొమ్మలు, పిచ్చిమారాజు, జైజవాన్‌, వాడేవీడు, పల్లెటూరు చిన్నోడు, అల్లూరి సీతారామరాజు, దొరబాబు, గుణవంతుడు, ఇద్దరుఇద్దరే, మహాకవి క్షేత్రయ్య, మగాడు, మనసులంతా ఒక్కటే, నేరం నాదికాదు ఆకలిది, మొనగాడు, భలే దొంగలు, చిరంజీవి రాంబాబు, బంగారు బొమ్మలు, మా ఇద్దరి కథ, మనసులు చేసిన దొంగలు, శభాష్‌ గోపీ, జీవనగంగ, టార్జన్‌ సుందరి, చంటి, సరదా బుల్లోడు వంటి చిత్రాల్లో నటించారు.
మంచినటి : అక్కినేని
మంజుల మంచినటి. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఇద్దరం కలిసి నటించాం. ఆమె ఇక లేరన్న వార్త అందడంతో మాటలు రావడం లేదన్నారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
కలివిడిగా ఉండేది : జమున
షూటింగ్‌ సమయాల్లోనే కాకుండా కుటుంబ కార్యక్రమాల్లోనూ అందరితో కలివిడిగా ఉండేదని జమున అన్నారు. ఈ వయసులో ఆమె లేరన్న వార్త అందడంతో విచారంలో మునిగిపోయానని అన్నారు. వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానని వాపోయారు.