రాణించిన షెహజద్‌ , మిస్బాబుల్‌

   

వన్డే సిరీస్‌ పాక్‌ కైవసం

సెయింట్‌ లూసియా ,జూలై 25 (ఆర్‌ఎన్‌ఎ): కరేబియన్‌ గడ్డపై జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్‌ కైవసం చేసుకుంది. సిరీస్‌ గెలవాలంటే నెగ్గాల్సిన ఐదో వన్డేలో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ మిస్బాబుల్‌ హక్‌ మరోసారి హాఫ్‌ సెంచరీ చేయడం ద్వారా జట్టుకు సిరీస్‌ విజయాన్ని అందించాడు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు మంచి ఆరంభాన్నివ్వడంలో ఓపెనర్లు మళ్ళీ విఫలమయ్యారు. డెవోన్‌ స్మిత్‌ , డారెన్‌ బ్రేవో తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. అయితే నిలకడగా ఆడిన మరో ఓపెనర్‌ ఛార్లెస్‌ , మార్లోన్‌ శామ్యూల్స్‌తో కలిసి మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. ఛార్లెస్‌ ఔటయ్యాక… శామ్యూల్స్‌ , గేల్‌ క్రీజులో ఉన్నప్పటకీ పరుగులు చేసేందుకు శ్రమించారు. సహజశైలి భిన్నంగా నెమ్మదిగా ఆడిన గేల్‌ 21 పరుగులు చేయగా…శామ్యూల్స్‌ 45 పరుగులకు ఔటయ్యాడు. వెంటనే సిమ్మన్స్‌ కూడా వెనుదిరగడంతో విండీస్‌ స్కోర్‌ 200 లోపే ముగుస్తుందనిపించింది. అయితే డ్వయాన్‌ బ్రేవో , డారెన్‌ సామి చివర్లో చెలరేగి ఆడడంతో స్కోర్‌ 240 దాటింది. పాక్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ ఏడోవికెట్‌కు 4.4 ఓవర్లలోనే 53 పరుగులు జోడించారు. బ్రేవో కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు,3 సిక్సర్లతో 48 పరుగులు చేయగా… సామి 18 బంతుల్లో 29 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 242 పరుగులు చేసింది. చివరి ఆరు ఓవర్లలో విండీస్‌ 72 పరుగులు సాధించడం విశేషం. 243 పరుగుల లక్ష్యఛేదనలో పాక్‌ ఓపెనర్లు నిలకడగా ఆడారు. తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. జంషెడ్‌ , హఫీజ్‌ త్వరగానే ఔటైనా…షెహజాద్‌ , కెప్టెన్‌ మిస్బాబుల్‌ హక్‌ పాక్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించారు. సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మిస్బాబుల్‌ మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. స్లాగ్‌ ఓవర్లలో విండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. అయితే ఉమర్‌ అక్మల్‌ , మిస్బా ధాటిగా ఆడడంతో పాక్‌ విజయానికి చేరువైంది. మిస్బా ఔటైనప్పటకీ…అఫ్రిది జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో పాక్‌ 49.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో చెత్తప్రదర్శనతో విమర్శల పాలైన పాకిస్థాన్‌ విండీస్‌పై సిరీస్‌ విజయంతో ఊరట చెందింది. కాగా ఆ జట్టు సారథి మిస్బాబుల్‌ హక్‌కే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ , మ్యాన్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డులు దక్కాయి.