తెలంగాణ ఇచ్చే దిశగా సోనియా

సీడబ్ల్యూసీలో పార్టీ నిర్ణయం

లగడపాటికి లంపెలు

కావూరి కట్టడి

రాయపాటి.. ఇటు రావొద్దు

సీమాంధ్ర పెత్తందారులకు కాంగ్రెస్‌ కళ్లెం

న్యూఢిల్లీ, జూలై 26 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే దిశగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడమే తరువాయి అని టెన్‌ జన్‌పథ్‌ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో కృత్రిమ ఉద్యమానికి తెరతీసిన పెట్టుబడిదారులైన నేతల కట్టడికి సైతం పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన అనంతరం సీమాంధ్ర పెత్తందారులు ఆ ప్రాంతంలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు. తాము ముందుండి రాజీనామాలు చేసి తెలంగాణ ఇస్తే ఏదో జరిగిపోతుందంటూ ఆ ప్రాంత ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించారు. దీంతో కొంతమంది విద్యార్థులు, యువత వారితో కలిసి నామ మాత్రపు ఉద్యమాన్ని నడిపారు. అయితే సీమాంధ్ర పెత్తందారుల చేతుల్లో కేంద్రీకృతమైన మీడియా ఆ ఉద్యమాన్ని చిలువలు పలువలు చేసి ఉన్నదీ లేనిది చూపింది. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని అబద్ధాలను వల్లించింది. హైదరాబాద్‌, తెలంగాణ వనరులను దోచుకొని బిలియనీర్లుగా మారిన పెత్తందారులు తెలంగాణ వస్తే తమ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని పన్నాగాలు పన్ని, కాంగ్రెస్‌ అధిష్టానంలోని కొందరిని మచ్చిక చేసుకొని తప్పుడు రిపోర్టుల ద్వారా కేంద్రం నిర్ణయం వెనక్కు తీసుకునేలా చేశారు. అప్పుడు తప్పుడు నివేదికలు ఇచ్చిన పార్టీ ముఖ్యులను ఇటీవల మందలించిన సోనియాగాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యతను దిగ్విజయ్‌సింగ్‌కు అప్పగించారు. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ దక్షిణాదిలో కనీసం 50 లోక్‌సభ స్థానాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీ ప్రాతినిథ్యం అంతంత మాత్రమే కావడంతో, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ లక్ష్యం చేరుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపకుండా తమ లక్ష్యం నెరవేరదని గుర్తించిన సోనియాగాంధీ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తెలంగాణ ఏర్పాటు తప్ప వేరే ప్రత్యామ్నాయం ఈ ప్రాంత ప్రజలు కోరుకోకపోవడంతో ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈమేరకు ఈనెల 12న కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం కోర్‌ కమిటీ మళ్లీ భేటీ అయింది. ఆగస్టు 5న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండో తేదీన సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది. 2009లో తెలంగాణ వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిపి మంత్రాంగం నడిపిన సీమాంధ్ర పెట్టుబడిదారులు లగడపాటి రాజగోపాల్‌, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావుకు సోనియాగాంధీ ఇప్పటికే చెక్‌ పెట్టారు. తెలంగాణపై కీలక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో సొంత పార్టీ నేతలు అధిష్టానం నిర్ణయంతో విభేదిస్తే ఎదురయ్యే పరిణామాలను ముందే పసిగట్టిన సోనియా ఈ ముగ్గురు నేతలను వేర్వేరుగా పిలిపించుకొని మాట్లాడినట్టు తెలిసింది. లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో హిల్స్‌, పవర్‌ ప్రాజెక్టుల్లో లోపాలను నేరుగా ప్రస్తావించి, ఎక్కువగా మాట్లాడితే వాటిని మూసేయడం తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన వక్ఫ్‌ భూముల్లో ల్యాంకో హిల్స్‌ నిర్మాణం చేపట్టగా, ల్యాంకో పవర్‌ ప్రాజెక్టుకు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్న మాటను సోనియా నేరుగా లగడపాటిని ప్రశ్నించినట్టు సమాచారం. సోనియా ప్రశ్నల వర్షం కురిపించడంతో ఈ నయా గాంధేయవాది నోరు మెదపకుండా వెనక్కి వచ్చేసినట్టు తెలిసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ లగడపాటి సమైక్యాంధ్ర మాటెత్తితే ఒట్టు. ఇక కావూరి సాంబశివరావుకు మంత్రి పదవి ఇచ్చి కట్టడి చేసిన సోనియా, మరో పెట్టుబడిదారు రాయపాటి సాంబశివరావు కాంట్రాక్టు వ్యవహారాలు, ఈ క్రమంలో చోటు చేసుకున్న అక్రమాలను పాయింట్‌ పాయింట్‌ వివరించి ఆంధ్రప్రదేశ్‌లో కనపడకుండా పోవాలని ఆదేశించినట్లు సమాచారం. అధినేత్రి కన్నెర్ర చేయడంతో బెంబేలెత్తిపోయిన రాయపాటి అమెరికా వెళ్లిపోయి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తంగా తెలంగాణకు అడ్డుపడుతూ కాంగ్రెస్‌ పార్టీ నేతలను కట్టిడి చేసి సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుపై పూర్తి స్పష్టత ఇచ్చేశారు.