అమరుల పోరాట ఫలితమే తెలంగాణ

బిల్లు పాసయ్యే వరకు పోరు దారి వీడొద్దు : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) :
తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతోందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ప్రాంత వాసులు సహకరించాలని కోరారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పుడే నిజమైన సంబరాలు జరుపుకుంటామన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించడంతో కోదండరామ్‌ బుధవారం హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకున్న వారికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, త్యాగాల ఫలితంగానే చిరకాల స్వప్నం సాకారమవుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీ`జేఏసీ భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. అయితే బిల్లు పాసయ్యే వరకూ పోరుదాడి వీడొద్దని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని సీమాంధ్ర ప్రాంతం వారిని కోరారు. హైదరాబాద్‌లోని ఆంధ్ర ప్రాంతం వారు ఆందోళన చెందవద్దని, వారు ఇక్కడు నిర్భయంగా ఉండవచ్చని భరోసానిచ్చారు. అన్ని పక్షాల భాగస్వామ్యంతోనే రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని సూచించారు.