ఖవాజా ఔట్‌పై ఐసిసికి ఆసీస్‌ బోర్డ్‌ ఫిర్యాదు

 

 

మాంచెస్టర్‌ ,ఆగష్ట్‌ 2 :

ఫీల్డ్‌ అంపైర్లు పొరపాట్ల కారణంగా ఆటగాళ్ళు నష్టపోకూడదనే ఉధ్ధేశంతో ప్రవేశపెట్టిన అంపైర్‌ డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌ ఇప్పుడు ఆస్టేల్రియా పాలిట విలన్‌లా మారింది. ఒకప్పుడు తాము గట్టిగా సమర్థించిన డీఆర్‌ఎస్‌ కారణంగానే యాషెస్‌లో ఆసీస్‌ వైఫల్యాల బాటలో నడుస్తోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో సవిూక్ష ద్వారా వచ్చిన నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా మూడో టెస్ట్‌ మొదటిరోజు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉస్మాన్‌ ఖవాజా ఔట్‌ కూడా వివాదాస్పదంగా మారింది. స్వాన్‌ బౌలింగ్‌లో ఖవాజా ఆడిన బంతి బ్యాట్‌ అంచుకు తాకినట్టు అనిపించడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. దీంతో ఖవాజా రివ్యూ కోరగా…. రీప్లేలో బ్యాట్‌కు బంతి తగల్లేదని తేలింది. అయితే థర్డ్‌ అంపైర్‌ మాత్రం ఔట్‌గా ప్రకటించడంతో ఆసీస్‌తో పాటు అభిమానులు ఆశ్చర్యపోయారు. మాజీ క్రికెటర్లతో పాటు ఆస్టేల్రియా ప్రధాని కెవిన్‌రూడ్‌ కూడా అంపైర్‌ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు ఆసీస్‌ విూడియా కూడా అంపైరింగ్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రపంచ క్రికెట్‌లో ఇంతటి చెత్త నిర్ణయం ఎప్పుడూ రాలేదని పత్రికలన్నీ పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించాయి. క్లార్క్‌ సెంచరీ కంటే కూడా ఖవాజా ఔట్‌పైనే ఆసీస్‌ విూడియా దృష్టి పెట్టడం విశేషం. ఇదిలా ఉంటే ఆసీస్‌ క్రికెట్‌ బోర్డ్‌ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఐసిసికి ఫిర్యాదు చేసింది. ఫీల్డ్‌ అంపైర్‌తో పాటు థర్డ్‌ అంపైర్‌ కూడా తప్పుడు నిర్ణయం ప్రకటించడంపై వివరణ ఇవ్వాలని ఐసిసిని కోరింది. మొత్తం విూద టెక్నాలజీ లోపాల కారణంగా యాషెస్‌ సిరీస్‌లో వివాదాలు సృష్టిస్తోన్న డీఆర్‌ఎస్‌పై రివ్యూ చేయాలని క్రికెట్‌ ఆస్టేల్రియా కూడా డిమాండ్‌ చేసేందుకు సిధ్ధమవుతోంది.